సింగపూర్ (చైతన్యరథం): ఏపీలో ఎయిర్‌బస్ మెయింటెనెన్స్, రిపైర్, ఓవర్ హాల్ (ఎంఆర్‌ఓ) హబ్ అభివృద్ధికి సహకరించాలని ఆ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీకి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌బస్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో సింగపూర్‌లో భేటీ అయిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ… భారతదేశంలో విమానాల సాంద్రత ఎక్కువగా ఉందన్నారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆగ్నేయాసియా మార్కెట్ల నుండి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇది మెయింటెనెన్స్, రిపైర్, ఓవర్ హాల్ (ఎంఆర్‌ఓ) సేవలకు పెద్ద క్యాప్టివ్ మార్కెట్‌ను సృష్టిస్తుంది. భారతదేశంలో 850 కంటే ఎక్కువ ఎయిర్‌బస్ విమానాలు ఎగురుతున్నాయి. ఎయిర్‌బస్‌కు భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సింగిల్-కంట్రీ మార్కెట్. రాబోయే 20 సంవత్సరాల్లో ఇండియాకు 1,750 విమానాలు అవసరమని అంచనాగా ఉంది. ప్రస్తుతం ఇరుకైన బాడీ కలిగిన ఏ`320 ఫ్యామిలీ విభాగాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎయిర్‌బస్ విమానాలు భారతదేశ వాణిజ్య విమానాల్లో దాదాపు 65-70 శాతం వరకు ఉన్నాయి. దక్షిణాసియాలో ఎయిర్‌బస్‌కు డెడికేటెడ్ ఎంఆర్‌ఓ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశముంది. విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. సమగ్ర ఎంఆర్‌ఓ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం సింగపూర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేం ప్రతిపాదిస్తున్న ఎంఆర్‌ఓ హబ్ భారతీయ విమానయాన సంస్థలకు ఫెర్రీ సమయం, ఖర్చులను తగ్గించడమేగాక, విమాన లభ్యతను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పొరుగు దేశాలలోని విమాన సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ఎంఆర్‌ఓ హబ్‌గా అభివృద్ధి చెందుతుంది, మా రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను చూసేందుకు ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు.
“`