- గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఉమ్మడి పరిశోధనలు చేపడదాం
- టాస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ
ఆస్ట్రేలియా (మెల్బోర్న్): యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. మంత్రి లోకేష్‌కు యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ (అకడమిక్) ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ అధిపతి ప్రొఫెసర్ గ్లెన్ జాకబ్సన్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టాస్మానియా విశ్వవిద్యాలయ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలి బ్రౌన్ మాట్లాడుతూ… తమ యూనివర్సిటీకి టాస్మానియా, హోబర్ట్, లాన్సెస్టన్, సిడ్నీలలో క్యాంపస్‌లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 2లో టాస్మానియా ఉంది. యూనివర్సిటీలో మొత్తం 40వేలమందికి పైగా విద్యనభ్యసిస్తుండగా, అందులో 15వేలమంది అంతర్జాతీయ విద్యార్థులు. ఆస్ట్రేలియా క్లైమాటిక్ యాక్షన్ (ది ఇంపాక్ట్ ర్యాంకింగ్), మెరైన్/ అంటార్కిటిక్ సైన్స్, ఓషనోగ్రఫీలో ప్రపంచవ్యాప్తంగా తమ యూనివర్సిటీ నెం.1 స్థానంలో ఉందని చెప్పారు. ఫార్మసీ, నర్సింగ్ గ్రామీణ ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో వివిధ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.
గత ఏడాది యూనివర్సిటీలో 1500మంది భారతీయ విద్యార్థులు ఐటి, ఇంజనీరింగ్, హెల్త్ సైన్స్, బిజినెస్ కోర్సుల్లో చేరారన్నారు. ‘‘భారతీయ విద్యార్థులకు టాస్మానియన్ ఇంటర్నేషనల్ స్కాలర్ షిప్‌లు అందిస్తున్నాం. రెన్యువబుల్ ఎనర్జీ, వాతావరణ స్థితిస్థాపకతపై ఐఐటిలతో కలసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టాం. భారతీయ విశ్వవిద్యాలయాలతో కలసి ఇంజనీరింగ్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్స్‌వంటి పాత్ వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భారతీయ విద్యార్థులకు టాస్మానియన్ పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ కల్పిస్తున్నాం. మా యూనివర్సిటీలో విద్యనభ్యిసించిన 5వేలమందికిపైగా పూర్వవిద్యార్థులు ఇన్ఫోసిస్, టీసీఎస్, అపోలో హాస్పటల్స్‌వంటి సంస్థల్లో కీలకస్థానాల్లో పనిచేస్తున్నారు. నర్సింగ్ విద్యకు సంబంధించి కేరళతో పలు భారత రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని డిప్యూటీ వైస్ ఛాన్సలర్ నటాలీ బ్రౌన్ తెలిపారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా (ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న కఠిన అక్రిడేషన్ వ్యవస్థల తరహాలో) ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకారం ఇవ్వాలని కోరారు. ఆయా కోర్సులకు సంబంధించిన శిక్షణలో డిజిటల్ హెల్త్ టూల్స్ అనుసంధానించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీకి టాస్మానియా వర్సిటీ ఫార్మా/ హెల్త్ కే నెట్‌వర్క్‌ను అందించి పరిశ్రమ భాగస్వామ్యాలకు సహకరించాలని కోరారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఏపీలోని గిరిజన ప్రాంతాలు, టాస్మానియా మారుమూల కమ్యూనిటీలపై దృష్టిసారిస్తూ ఉమ్మడి పరిశోధనలు నిర్వహించండి. ఏపీలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్/ ఫ్యాకల్టీ ఎక్స్చేంజి కార్యక్రమాలు చేపట్టండి. ఏపీలో జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రోగ్రామ్ మాదిరిగా ఆస్ట్రేలియా మా విద్యార్థుల ప్లేస్‌మెంట్ కోసం స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహించండి. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థుల స్కిల్ సర్టిఫికేషన్స్‌ను బెంచ్ మార్కు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.














