- ఎమ్మెల్యే గణబాబు సూచనలతో ప్రత్యేక ప్రణాళికలు
- విశాఖలో 11 క్రీడల నిర్వహణకు చర్యలు
- త్వరలో వాటర్ గేమ్స్ పునఃప్రారంభిస్తాం
- శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖపట్నంలో నిర్మాణాత్మకంగా క్రీడలను అభివృద్ధి చేసేందుకు స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు(గణబాబు) సూచనలతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. నగర పరిధిలోని గోపాలపట్నం మినీ ఇండోర్ హాలును వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి ఆదివారం రవినాయుడు సందర్శించారు. తొలుత ఇండోర్ హాలులోని బ్యాడ్మింటన్, షటిల్, టేబుల్ టెన్నిస్, జిమ్, క్రికెట్ గ్రౌండును ఆయన పరిశీలించారు. ఇండోర్ హాలు నిర్వహణ, క్రీడల అభివృద్ధిపై డీఎస్‌ఏ అధికారులను ఆరా తీశారు. అలాగే ఇండోర్ హాలులో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గణబాబు సూచనలు, సహకారంతో విశాఖలో పదకొండు క్రీడలను నిర్వహించేలా ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖను క్రీడాహబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే విశాఖలో స్పోర్ట్స్ అకాడమీ స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే అకాడమీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఏపీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిలో విశాఖ క్రీడాకారులు అధికంగా ఉన్నారన్నారు. దానికి అనుగుణంగా విశాఖలో మెరుగైన క్రీడావసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే గ్రామీణ క్రీడలను సైతం ప్రోత్సాహించేందుకు, విద్యార్థులు క్రీడలవైపు మొగ్గు చూపేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నాడు శాప్ డైరెక్టర్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గణబాబు విశాఖకు వాటర్స్ గేమ్స్‌ను తీసుకొచ్చారన్నారు. కానీ గత ప్రభుత్వంలో జగన్‌రెడ్డి స్వార్థానికి వాటర్ గేమ్స్ నిర్వీర్యమయ్యాయన్నారు. త్వరలోనే వాటర్ గేమ్స్‌ను పునఃప్రారంభిస్తామని, పదిహేను రోజుల్లో ఆక్రమణకు గురైన వాటర్ స్పోర్ట్స్ స్థలాన్ని శాప్ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. అలాగే అసోసియేషన్లు, ఫెడరేషన్లు, డీఎస్‌ఏల అధికారులు సమన్వయంతో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అలాగే ఇండోర్ హాలును స్వీయసుస్థిరత మార్గంలో నిర్వహించనున్నామన్నారు.
క్రీడలను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే గణబాబు
క్రీడల్లో రాణింపు, క్రీడల అభివృద్ధి విషయంలో ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు వివరించారు. క్రీడలతో తమ కీర్తిప్రతిష్టతలను అన్ని దేశాలు చాటుకుంటున్నాయన్నారు. క్రీడాపరంగా ముందంజలో ఉన్న దేశాల సరసన భారత్ కూడా నిలవాలంటే అత్యధిక పతకాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మొదటి నుంచి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, దానిలో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ క్రీడాసౌకర్యాలను కల్పించారని, అప్పట్లోనే జాతీయ, ఆసియా, ఎఫ్రాన్ క్రీడలను సైతం విజయవంతంగా నిర్వహించారన్నారు. ప్రస్తుతం ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు దృఢనిశ్ఛయంతో పనిచేస్తున్నారన్నారు. దానికోసమే శాప్ ఛైర్మన్ పదవిని సమర్థుడైన రవినాయుడుకు అప్పగించారన్నారు. అనతికాలంలోనే రాష్ట్ర క్రీడల అభివృద్ధిలో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చారన్నారు. ముఖ్యంగా క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా క్రీడలను ప్రోత్సహించాలని, తద్వారా తమ బ్రాండ్ కూడా మరింత విస్తరించుకునే అవకాశం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీఓ జూన్ గాలియట్, శాప్ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.