- వీలైనంత వర్క్ ఫోర్స్ పెట్టండి
- అవసరమైన మిషనరీని తీసుకురండి
- సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించి ప్రతిఫ్లోరును పరిశీలించిన సీఎం
అమరావతి (చైతన్యరథం): రాజధాని నిర్మాణాల పూర్తికి కచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకుని ఆ మేరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో సోమవారం సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రతి ఫ్లోర్ను పరిశీలించారు. ఏ అంతస్తుల్లో ఏయే కార్యాలయాలు ఏర్పాటు చేశారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఆర్డీఏ భవనంలోనే రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పనులు ప్రారంభించిన చోట నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం ఆరా తీశారు. పనులకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా… వర్షాకాలం పూర్తి అయిన తర్వాత పూర్తిస్థాయిలో పనులు పరుగులు పెట్టించాలన్నారు.
నిర్దేశిత సమయంలో పనుల పూర్తికి తగినంతగా వర్ఫర్స్ను నియమించుకోవాలన్నారు. అవసరమైతే మరింత మందిని రప్పించాలన్నారు. అధునాతన యంత్రసామగ్రిని తీసుకురావాలన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు. ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు కూడా చెబుతానన్నారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.