- నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి
- రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధాని
- ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభోత్సవం
- విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నాం
- ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ చేయాలి
- ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
- మంత్రులు అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన జరిగే ప్రధాని సభ ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి చర్చించారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయని… ఆ రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగనుందన్నారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని… అయితే అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేర ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిరదని సీఎం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో… గత ప్రభుత్వ కారణంగా తలెత్తిన సవాళ్లను పరిష్కరించి, నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు.
ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేసిన రాజధానిని గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని.. నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి…ఒక అద్భుత రాజధానిని నిర్మించి… విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని సీఎం ఉద్ఘాటించారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని… దీన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందన్నారు. ప్రజా రాజధాని, ఆంధ్రుల స్వప్నాన్ని కుట్రలకు, కుతంత్రాలతో ఎవరూ చెరిపి వేయలేరని చాటి చెప్పేందుకే… మళ్లీ దేశం అంతా గుర్తించేలా రాజధాని పనులను స్వయంగా ప్రధాని చేతుల మీదుగా పున: ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలని… రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్రప్రదేశ్… నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారని… మొన్న జరిగిన ఢల్లీి భేటీలో పలు సూచనలు చేశారని సీఎం గుర్తు చేశారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ద్వారా అధికారులు 2వ తేదీ కార్యక్రమ నిర్వహణ క్రమాన్ని, ఏర్పాట్లను వివరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూరప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలన్నారు. భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని… ఇదే సమయంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాజధాని గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని… వారంతా సభకు రావాలని భావిస్తారని సీఎం అన్నారు. రవాణా సహా ఇతర అంశాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తగు సూచనలు, ప్రకటనలు చేసి ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు. డీజీపీతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
“