అమరావతి (చైతన్యరథం): దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ, నటరత్న, డాక్టర్ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా నిర్వహించే మహానాడుకు ముందు నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిలో మహానాడులు నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు 18, 19, 20 తేదీల్లో నియోజకవర్గ మహానాడులు, 22, 23 తేదీలలో పార్లమెంట్ మహానాడులు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం పార్టీ నేతలకు తెలియజేశారు. అసెంబ్లీ నియోజకవర్గ మహానాడు తీర్మానాలను ఈ నెల 21వ తేదీలోపు, పార్లమెంట్ నియోజకవర్గ తీర్మానాలను ఈ నెల 24వ తేదీలోపు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, నాయకులు, మహిళలను మహానాడు కార్యక్రమానికి ఆహ్వానించి జయప్రదం చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో పల్లా శ్రీనివాసరావు కోరారు. టీడీపీ మహానాడు ఈ నెల 27,28,29 తేదీల్లో కడపలో జరగనున్న విషయం తెలిసిందే.