అమరావతి (చైతన్య రథం): హింసాత్మక సంఘటనల మధ్య చిక్కుకున్న నేపాల్‌లోని తెలుగు ప్రజలను సురక్షితంగా వారి వారి కుటుంబాల వద్దకు చేర్చడంలో బాధ్యతతో కూడిన కరుణతో వ్యవహరించిన మంత్రి నారా లోకేష్ బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తెలుగు ప్రజలు గమ్యస్థానాలకు చేరుకున్నారన్న సమచారంతో సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెట్టారు. ‘తెలుగు ప్రజలను సురక్షితంగా వారి కుటుంబాల వద్దకు చేర్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సత్వర, వేగవంతమైన సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. ఐటీ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఆర్టీజీఎస్, ఎన్నార్టీ బృందాలు, ఏపీ భవన్ సిబ్బందికి అభినందనలు. మన ప్రజల సురక్షితమైన పునరావాసం కోసం మీరు ప్రదర్శించిన అవిశ్రాంత ప్రయత్నాలు, సత్వర ప్రతిస్పందన, కరుణాపూరిత విధానానికి అభినందనలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.