తూర్పు నాయుడుపాలెం (చైతన్యరథం): మొంథా తుఫాన్ దాటికి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, వాటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుపై సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. శుక్రవారం నాడు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి డీబీవీ స్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….మొంథా తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో పాడైపోయిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇతర రోడ్ల వివరాలు సేకరించి వాటి పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుపై సమగ్ర నివేదిక అందించాలన్నారు. పూర్తిగా దెబ్బతిన్న కల్వర్టుల స్థానంలో కొత్త వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా ఎంత మేర పాడయ్యాయో వివరాలు సేకరించి త్వరితగతిన నివేదిక అందజేయాలని అధికారులను మంత్రి డీబీవీ స్వామి ఆదేశించారు.












