- అన్యాక్రాంతమైన భూములు ఇప్పించాలంటూ బాధితుల ఫిర్యాదు
- 22ఏ నుంచి తమ భూములు తొలగించాలని అర్జీలు
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న నాయకులు
- అర్జీలు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి
అమరావతి (చైతన్య రథం): వైసీపీ ప్రభుత్వహయాంలో ఉద్దేశపూర్వకంగా భూముల్ని 22ఏ జాబితాలో చేర్చడం, అధికారం అడ్డంపెట్టుకుని భూములను కబ్జా చేయడంపై బాధితులు బుధవారంనాటి గ్రీవెన్స్‌లో అర్జీలు సమర్పించారు. సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులకు విన్నవించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డిలు వినతులు స్వీకరించారు. సత్యసాయి జిల్లా అమడగూరు మండలం జౌకుల కొత్తపల్లి గ్రామానికి చెందిన కె రెడ్డప్ప అర్జీని ఇస్తూ.. తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని వైసీపీ నేతల ప్రోద్భలంతో 22ఏ జాబితాలో పడేశారని.. తమ భూమిని 22ఏ నుంచి తొలగించాలని వేడుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గోపి కృష్ణ అర్జీని సమర్పిస్తూ.. నూజివీడు గ్రామంలో తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని జగనన్న ఇళ్లకోసమని తీసుకొని 22ఏలో పెట్టారని.. దాన్ని తొలగించి తమ భూమిని అప్పగించాలని నేతలకు విజ్ఞప్తి చేశారు. ఉరుటి బానూజిరావు, కూనిశెట్టి భాస్కర్ రావు, కూనిశెట్టి మోహన్ రావు, కనకల వెంకటరావులు ప్రభుత్వ పోరంబోకు వాగును ఆక్రమించారని దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విజయనగరం జిల్లా రామభద్రపు మండలం ఆరికతోట గ్రామానికి చెందిన పి రాధాకృష్ణ నేడు గ్రీవెన్స్‌లో అర్జీ సమర్పించి.. చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు అర్జీని సమర్పిస్తూ. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దనున్న పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. దీనిపై విచారించి తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలానికి చెందిన టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి సుదర్శన నాయుడు నేతలకు విజ్ఞప్తి చేస్తూ..
గండికోట నుండి పుట్లూరు వయా సుబ్బరాయసాగర్ ఎత్తిపోతల పథకం ఆర్థిక శాఖ క్లియరెన్స్‌లో ఉన్నదని.. ఈ పథకం పూర్తయితే దాదాపు 35వేల ఎకరాలకు సాగునీరు రెండు మండలాల్లోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుందని.. త్వరగా నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన యేదల శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. తాను గుంటూరులోని మలబార్ సీడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ వద్ద నగదు చెల్లించి కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవని తెలిసి తిరిగి విత్తనాలను వెనక్కిపంపిస్తే.. చెల్లించిన నగదుకు రెండు చెక్కులిచ్చి డబ్బులు తీసుకోమని చెప్పారని.. బ్యాంకులో వేస్తే చెక్కులు బౌన్స్ అయ్యాయని.. మలబార్ సీడ్స్‌ను డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకొని డబ్బులు ఇప్పించాలని గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన దొడ్డా శేషాద్రి గ్రీవెన్స్‌లో నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. తమ ఊరి చెరువుకు వర్షపు నీరు వచ్చే నల్ల వాగు కలువకంటే వెలుగొండ కాలువ బ్రిడ్జీని ఎత్తులో కట్టడం వలన చెరువులోకి రావాల్సిన నీరు వృథాగా పోతుందని.. దాంతో చెరువులోకి నీరురాక గ్రామ రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. దయచేసి చెరువులోకి నీరు వచ్చేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలానికి చెందిన కొండామర్రెపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర విజ్ఞప్తి చేస్తూ.. తమకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని మరోకరు కబ్జా చేశారని, తమకు మంజూరు చేసిన భూమిని కబ్జా నుండి విడిపించాలాని వేడుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన వేముల శ్రీను విజ్ఞప్తి చేస్తూ.. తాను దివ్యాంగుడినని తనకు వస్తున్న పింఛన్‌ను గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని తొలగించి తనకు అన్యాయం చేశారని.. తొలగించిన పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు. అర్జీలను పరిశీలించి సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు.