- సాంకేతిక అంశాలు, సమస్యలపై అధ్యయనం
- రెండు రాష్ట్రాల అధికారులు, నిపుణులతో 21 లోగా ఏర్పాటు
- కేంద్ర జలశక్తి మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయం
- కేఆర్‌ఎంబీ అమరావతిలో, జీఆర్‌ఎంబీ హైదరాబాదులో
- రిజర్వాయర్ల అవుట్ ఫ్లోలకు టెలీ మీటర్లు
- శ్రీశైలం ప్రాజెక్ట్ రక్షణకు సమష్టి చర్యలు
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు సఫలం
- వివరాలు వెల్లడిరచిన మంత్రి నిమ్మల రామానాయుడు
ఢల్లీి: పోలవరం` బనకచర్ల ప్రాజెక్టుపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం ఢల్లీిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఫలప్రదంగా జరిగిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల మంత్రులు, సీడబ్ల్యూసీ అధికారులు, ఇంజనీర్లు, అలాగే ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశం స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని మంత్రి రామానాయుడు చెప్పారు. సమావేశం అనంతరం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సమావేశంలో మూడు ముఖ్యాంశాలపై నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అందులో మొదటిది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి కాలువలకు వెళ్లే అవుట్ ఫ్లో కు సంబంధించి టెలిమీటర్లు ఏర్పాటు చేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. రెండవది.. తెలుగు జాతి సంపద అయిన శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలసి కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు మరమ్మతుల విషయంలోనూ, ప్లంజ్ పూల్ రక్షణ విషయంలోనూ (కేంద్ర జలసంఘం) సీడబ్ల్యూసీ సిఫార్సులు, నిపుణుల సూచనలు సత్వరమే పాటించి చర్యలు తీసుకునే అంశంపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసి అంగీకారం తెలిపాయి.
మూడో అంశమైన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కేఆర్‌ఎంబీ) అమరావతి లోను, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (జీఆర్‌ఎంబీ) హైదరాబాదులోను ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రామానాయుడు వివరించారు. అలాగే మరో ముఖ్యాంశమైన పోలవరం `బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పైన, తెలంగాణ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాల పైన అధ్యయనానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున..ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక కమిటీ వేయాలని ఉభయ రాష్ట్రాలు నిర్ణయించినట్లు నిమ్మల స్పష్టం చేశారు. ఈ కమిటీలో ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ సీడబ్ల్యుసీి ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. కాలయాపన లేకుండా వచ్చే సోమవారం (21వ తేదీ) లోపునే కమిటీ నియామకం జరుగుతుందన్నారు. అలాగే గోదావరి నది నుంచి ఏటా సముద్రంలో కలసిపోతున్న 3000 టీఎంసీల నీటి వృథాపై కూడా కమిటీ ఆరా తీసి తమ నివేదికలో పొందుపరుస్తుందని మంత్రి రామానాయుడు చెప్పారు. రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా తెలుగుజాతి ఒకటేనన్న స్నేహపూర్వక వాతావరణంలో ఢల్లీి సమావేశం జరగటం గొప్ప శుభ పరిణామంగా మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు.
వృథా జలాలు వాడుకునేలా బనకచర్ల
ఈ సమావేశంలో సుమారు గంటన్నరపాటు వివిధ అంశాలపై చర్చించారు. భేటీ ప్రారంభంలో సీఆర్ పాటిల్‌తో పాటు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ.. 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి.
ఈ సమావేశంలో పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించారు. గోదావరి నుంచి సముద్రంలోకి ఏటా 2 వేల నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా గోదావరిలో వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను వివరించారు. అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు ఆయన అందజేశారు. ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుండగా బనకచర్ల ద్వారా గరిష్ఠంంగా 200 టీఎంసీలే తరలిస్తామన్నారు. వృథాగా పోతున్న నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతానికి లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ రాష్ట్రానికీ ఇబ్బంది కలిగించకుండా.. సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని..11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకూ తాము అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. దిగువ రాష్ట్రంగా తమ పరిస్థితిని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నరపాటు సీఎస్‌లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు..