- బందిపోట్లు, రౌడీలు, బ్లేడ్‌బ్యాచ్‌కి వైసీపీ నేతలకు తేడాలేదు
- యువకుల కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడుతున్న సీఎం చంద్రబాబు
- ఆయనతో పోటీపడి పనిచేయగలరా
- పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన తప్పులు, అవినీతి, దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాయలలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కుమార రాజా మాట్లాడుతూ ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, బూతు పురాణాలు వల్లెవేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లాలో పామర్రు ప్రశాంతమైన నియోజకవర్గం. అన్న ఎన్టీరామారావు నడయాడిన చోటు. అందరికీ కూడు, గుడ్డ, నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాంటి వ్యక్తి జన్మించిన నిమ్మకూరు ఉన్న ప్రాంతం మా నియోజకవర్గం. మా నియోజకవర్గంలో 80 శాతానికి పైగా రైతాంగం ఉన్నారు. కులాలు, మతాలు, వర్గాల మధ్య విద్వేషాలతో సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగ కలిసి మెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్రులో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నేత పేర్ని నాని కుట్రలకు తెరతీశారు.
గత ప్రభుత్వంలో ఓట్ల కోసం దొంగ పట్టాలిచ్చి ప్రజల్ని పేర్ని మోసం చేశారు. రేషన్ బియ్యం బొక్కిన గజదొంగ. వీటన్నింటితోపాటు ఇటీవల ఉచ్ఛనీచాలు మరచి మాట్లాడాడు. పేర్ని నాని తీరు రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ఉంది. విషం చిమ్మే విపక్ష నేత జగన్. చంబల్ లోయలోని బందిపోట్లకు, రామాంతపురం రౌడీలకు, కంజర్‌కట్టు కిరాతకులకు, బెజవాడ బ్లేడ్ బ్యాచీకి వైసీపీ నాయకులకు తేడాలేదు. వైసీపీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ మనకు అడ్డొచ్చేవారిని రాత్రిపూట నరికేసి చీకట్లో పనికానిచ్చేద్దాం, ఉదయాన్నే ప్రజాస్రవంతిలో కలిసి వెళ్లి పరామర్శిద్దాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇది బందిపోట్లు, బ్లేడ్ బ్యాచ్ లు చేసే పని. పేర్ని వ్యాఖ్యలతో పామర్రు నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యల వీడియో బయట పడినప్పటికి జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలకు తాడేపల్లి ప్యాలెస్ నుండే సూచనలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టిన సూపర్ సిక్స్ బాల్‌తో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయి. విషం చిమ్ముతున్నారు. పెన్షన్‌ను ఒకేసారి రూ.1000 పెంచటంతోనే జగన్ కు మతిపోయింది. ఇక తల్లికి వందనంతో జగన్ దిమ్మతిరిగింది. ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం అమలు చేయటంతో.. ఫ్రస్టేషన్‌లో కూరుకుపోయిన జగన్ దిక్కుతోచక రోడ్ల మీదికొచ్చి అరాచకాలు చేసేలా వైసీపీ నేతలను ప్రోత్సహిస్తున్నాడు. రాబోయే రోజుల్లో అన్నదాత సఖీభవ కూడా అమలుచేయనున్నాం. అన్నదాతలందరూ సుఖంగా ఉంటే జగన్ కు మాత్రం దుఖీభవ కానుంది. ఈ విధంగా ఆఖరి బాల్ పడే సమయానికి వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది. డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా పేర్ని నాని ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పందికొక్కుల్లా బియ్యం బొక్కిన విషయం అందరికీ తెలుసు. ఓట్లు దండుకోవడానికి దొంగపట్టాలిచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. కొడాలి నానీ, వంశీ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. వైసీపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసినవారికి దానికి తగ్గట్టుగా శిక్ష పడుతుంది. అంతే తప్ప ఎవరిమీదా రాజకీయ కక్షసాధింపులు ఉండవు. రేపటి పౌరులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే చంద్రబాబు ఆలోచన. రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం కూడా ఆగదు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలవుతాయి.
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా అమలుచేస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా భారీగా రప్పించేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్నాటకకు బెంగళూరు మహారాష్ట్రకు ముంబాయి ఉన్నాయి.. మరి ఆంధ్రప్రదేశ్ వారికి ఏమున్నాయని ఎవరైనా అడిగితే.. మాకు చంద్రబాబు తెలివితేటలున్నాయి, ఆయన విజనే మాకు పెట్టుబడి అంటాం. రాబోయే రోజుల్లో అమరావతి, పోలవరం, బనకచర్ల పూర్తవుతాయి. యువకుల కంటే చంద్రబాబు పదిరెట్లు ఎక్కువ శ్రమ పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా చంద్రబాబు ఇంకా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. చంద్రబాబు తిరుమల, తిరుపతి దేవస్థానం మెట్టు ఎక్కి దేవుని దర్శనం చేసుకుని సాయంత్రానికల్లా కిందకు దిగగలరు. పేర్ని నాని ఎక్కగలరా? వయసుతో పనిలేదు, సేవ చేయాలనే తపన ఉండాలి. ప్రజాగ్రహానికి గురయినందునే వైసీపీ 11 సీట్లకే పరిమితమయింది. సుపరిపాలనకోసం ప్రజలు కూటమికి అఖండ విజయం అందించారు. ఆ దిశగానే సీఎం చంద్రబాబు నడుస్తున్నారు. కక్ష సాధింపులకు ఆయన హయాంలో చోటు లేదు. వైసీపీ నాయకులు బురద జల్లుతారు, విషం చిమ్ముతారు. సమయానుకూలంగా వారు చేసే పనులకు శిక్షలుంటాయని ఎమ్మెల్యే కుమారరాజా స్పష్టం చేశారు.