- పెట్టుబడులకు అనువుగా 175 నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులు
- ఎంఎస్‌ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
- సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల ఎంఓయూలు
- కేంద్రం ఏ పాలసీ తెచ్చినా మొదట అమలు చేసేది ఏపీనే
- 2026 నాటికి వెలుగొండ పూర్తిచేసి ప్రకాశం జిల్లాకు జలాలిస్తాం
- కనిగిరి ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
- 17 జిల్లాల్లో వర్చువల్‌గా పారిశ్రామిక పార్కులు ప్రారంభించిన సీఎం
కనిగిరి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత ఆలోచనలతో ముందుకొస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యుత్, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. అలాగే, 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్‌ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితోపాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లనూ సీపం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల ఎంఓయూలు
‘‘పరిశ్రమలకు అనువైన వాతావరణం, పాలసీలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం తగిన చేయూత అందిస్తుంది’’ అని సీఎం ప్రకటించారు. ఈ అంశంపై మాట్లాడుతూ ‘‘నేడు 99 కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. వీటిద్వారా రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 2 లక్షలమందికి పైగా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. జనవరికి మరో 70 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభిస్తాం. 175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి ప్రతీ కుటుంబంలోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారుచేస్తాం. భవిష్యత్ అంతా టెక్నాలజీదే. క్వాంటమ్ కంప్యూటింగ్ జనవరికి అమరావతిలో ప్రారంభమవుతుంది. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లను మన రాష్ట్రంనుంచి ఉత్పత్తి చేసి పంపించేలా పరిస్థితి మారుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిని ఇంటినుంచే తయారు చేసుకునేలా ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ బయో ఫ్యూయెల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. తక్కువ వ్యయంతో విద్యుదుత్పత్తి చేసేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం. డ్రోన్ సిటీని ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్నాం. సివిలియన్, డిఫెన్స్ అప్లికేషన్ల కోసం డ్రోన్లను ఇక్కడే తయారు చేస్తాం. రాష్ట్రానికి సెమీకండక్టర్ పరిశ్రమ కూడా త్వరలోనే ఏర్పాటవుతోంది. 14, 15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఈ ఒప్పందాల ద్వారా 8 లక్షలకుపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
గత ప్రభుత్వంలో పరిశ్రమలు మూతపడ్డాయి
గత పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని.. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంనుంచి పారిపోయారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ఈ అంశంపై సీఎం మాట్లాడుతూ ‘‘చెత్తనుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానం. కొత్తగా ఏర్పాటవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు దీనిని అందిపుచ్చుకోవటం సంతోషదాయకం. దీనిద్వారా రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారులువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వటం కాదు… పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్పి ఇప్పుడు దానిని నిరూపిస్తున్నాం. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో 17 నెలల క్రితం పాలనాపగ్గాలు చేపట్టాం. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నాం’’ అని సీఎం వివరించారు. గత పాలకులు పీపీఏలు రద్దు చేశారు. కరెంటు వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించారు. ఆ నిధులు వృధాకాకుండా ఉండివుంటే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టుకునే వాళ్లం. అన్ని విధాలుగా గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ఛలోఛలో అని పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే… ఇప్పుడు భలేభలే అంటూ రాష్ట్రానికి వస్తున్నారు. విశాఖకు లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ వస్తోంది. ఇదీ కూటమి ప్రభుత్వంపై కంపెనీలకు ఉన్న విశ్వాసం. కేంద్రం ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని మొదట అమలు చేస్తోంది ఏపీనే. ప్రధాని మోదీ ఏది మొదలు పెట్టినా ఏపీలో తక్షణం అమలు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా మంత్రి లోకేష్ పనిచేస్తూ సాధించి తీసుకువస్తున్నారు’’ అని సీఎం స్పష్టం చేశారు.
సంపద సృష్టిలో ప్రజల భాగస్వామ్యం
‘‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆలోచనలే ఇప్పుడు ఆస్తి, రైతులు ఎఫ్‌పీఓలు పెట్టుకుని పారిశ్రామికవేత్తలుగా మారండి. హార్టికల్చర్, ఆక్వా కల్చర్, సేవలరంగంతోపాటు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుకు వెళ్లాలి. ఎంఎస్‌ఎంఈల ద్వారానే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునేలా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు, తిరుపతి సహా మరికొన్ని ప్రాంతాలతో మరో రీజియన్‌గా అభివృద్ధి చేస్తాం. పోర్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్‌గా తయారు చేస్తాం. 15 శాతం వృద్ధి రేటు సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం గణనీయంగా పెంచేలా పనిచేస్తున్నాం. రామాయపట్నం పోర్టుకు దగ్గరే బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో సంపద సృష్టింస్తాం. అందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
వచ్చే ఏడాది వెలుగొండ ద్వారా నీళ్లు
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘ఈ ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు విస్తరించాల్సి ఉంది. 2026లో వెలిగొండ పూర్తి చేసి నీళ్లిస్తాం. కనిగిరి ఇక కనకపట్నం అవుతుంది. కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కరవు అధికంగా ఉంటుంది. ఈ నియోజకవర్గాలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చాం. దాన్ని త్వరలోనే నెరవేరుస్తాం. 2019లో అధికారంలోకి రాకపోవడం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైపోయింది. శ్రీశైలంనుంచే కాదు గోదావరి నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తెస్తాం. వైకుంఠపాళి వల్లే ప్రజల కష్టాలు తీరకుండా అలాగే ఉండిపోయాయి. భవిష్యత్తులో ఇది జరక్కూడదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.













