అమరావతి (చైతన్యరథం): ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ మాజీ ఎంపీ, మద్యం స్కాంలోనూ కీలక పాత్రధారిగా భావిస్తున్న విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన హాజరు కావాలని సిట్ నోటీసుల్లో ఆదేశించారు. విజయవాడ సీపీ కార్యాలయంలో విచారణకు విజయసాయి రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో సాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి) అని విజయసాయిరెడ్డి గతంలో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో సిట్ అధికారులు విజయసాయి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన పరారీలో ఉన్నారు. కోర్టు నుంచి ఊరట లభించకపోయినప్పటికీ ఆయన పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. రాజ్ కసిరెడ్డి మద్యం స్కాంలో సంపాదించిన డబ్బులను ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారు.. ఏ ఏ ఆస్తులను కొనుగోలు చేశారో కూడా సీఐడీ అధికారులు తేల్చారు. గతంలో కాకినాడ. పోర్టు వ్యవహారంలో సీఐడీ ఎదుట హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కాం గురించి తనకు నోటీసులు ఇస్తే మొత్తం చెబుతానని చెప్పారు. ఇప్పుడు ఆయన తనకు తెలిసిన వివరాలన్నీ బయట పెట్టాల్సి ఉంది.
కొనసాగుతున్న సోదాలు
హైదరాబాద్: వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా హైదరాబాద్లో సిట్ అధికారుల సోదాలు రెండో రోజు మంగళవారం కూడా కొనసాగాయి. నగరంలోని రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బంధువు మేఘనారెడ్డి ఇంట్లో సిట్ బృందం సోదాలు జరిపింది. ఆమె బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బు విత్ డ్రా అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోదాలు జరిపారు. మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ సిట్ బృందం సోమవారం సోదాలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని మూడు ప్రాంతాల్లో మొత్తం 50 మంది సిట్ అధికారులు తనిఖీలు చేశారు.