- ప్రైవేటు ఆలయంలో తొక్కిసలాట
- 9 మంది మృతి, పలువురికి గాయాలు
- శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం
- ప్రైవేటు వ్యక్తుల నియంత్రణలో ఆలయం
- ఏకాదశి రోజున అంచనాలకు మించి భారీగా భక్తులు రాక
- రద్దీ కారణంగా రెయిలింగ్ ఊడి తొక్కిసలాట
- పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వని నిర్వాహకులు
శ్రీకాకుళం (చైతన్యరథం): దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఊహించని విధంగా మృత్యువాత పడిన తీవ్ర విషాదం శీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ దేవాలయం ప్రభుత్వ నిర్వహణలో, దేవాదాయ శాఖ పరిధిలో లేదు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం. ఈ దేవాలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉంది. శనివారం ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు వచ్చారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ… ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కానీ సదరు వ్యక్తి చేయలేదు. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణం.
మొదటి అంతస్తులో ఉన్న ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. రద్దీ కారణంగా రెయిలింగ్ ఊడిపడటంతో భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. సుమారు 25 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మి (50), పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ (60), మందసకు చెందిన రాజేశ్వరి (60), బృందావతి (62) నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ (56), సోంపేటకు చెందిన నిఖిల్ (13), పలాసకు చెందిన అమ్ముడమ్మగా గుర్తించారు. రూప అనే మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
కంట్రోల్ రూమ్
ఈ ఘటనలో 13 మంది క్షతగాత్రులకు పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి బాధితులకు సమాచారం అందించేందుకు అధికారులు శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 08942 240557కు ఫోన్ చేసి అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రెయిలింగ్ ఊడి పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుందని, ఘటనాస్థలంలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులకు పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇంత మంది వస్తారనుకోలేదు
కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలిపారు. ఇంత మంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆలయంలోనే హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు.
ప్రభుత్వ ఆధీనంలో లేదు
శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదన్నారు. హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం అని తెలిపారు.














