- సదస్సులో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- విజయవాడ, విశాఖలో భూవివాద పరిష్కారానికి ట్రైబ్యునల్స్
- వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం
- అందుకు, ఎంస్‌ఎంఈలతో సమావేశాలు ఏర్పాటు
- పెట్టుబడులపై సమీక్షలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): 18 నెలల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీలో ఆమోదం తెలిపామని, ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో కొన్ని సివిల్ పనులు ఇప్పటికే మొదలైనట్టు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మరింత వేగంగా ముందుకెళ్లాలంటే `భూ కేటాయింపులకు సంబంధించిన అంశాల్లో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. విజయవాడ, విశాఖలో భూవివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుధవారం నిర్వహించిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వివిధ రంగాల్లో వచ్చిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలకు భూకేటాయింపులపై చర్చించారు. ఏపీఐఐసీలో ఏమేరకు భూమి అందుబాటులో ఉందనే అంశంపై సమావేశంలో ప్రస్తావన సాగింది. ఏపీఐఐసీకి చెందిన సుమారు 82 వేల ఎకరాల భూములు 22ఏ పరిధిలోకి వెళ్లాయని అధికారులు చెప్పడంతో.. ఆ భూమికి సంబంధించిన సాంకేతికాంశాలు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. సాంకేతిక ఇబ్బందులు లేకుంటే 22ఏ పరిధినుంచి భూములను తప్పించేలా కెబినెట్ సమావేశానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.
పెట్టుబడులు పెట్టే కంపెనీలకు చేసే భూకేటాయింపుల్లో టూరిజం శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత ఐటీ కంపెనీలకు భూములివ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూ.. ‘‘రాంప్ పథకంలో ఎంస్‌ఎంఈల వృద్ధిని నమోదు చేయండి. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యం సాధించేందుకు ఎంస్‌ఎంఈలతో సమావేశాలు ఏర్పాటు చేయండి. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి చేయండి. ఆసైన్డ్ భూములకు కూడా రూ.31 వేలు లీజు చెల్లించండి. నెడ్ క్యాప్ ద్వారా ఈ భూములు లీజుకిచ్చే అవకాశం ఉంది. భోగాపురంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటికీ ఫౌండేషన్ చేసుకున్నాం. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో మంచి విద్యా సంస్థలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. హోటళ్లు, టూరిజం ప్రాజెక్టులు పెద్దఎత్తున చేపట్టేలా చర్యలు చేపట్టండి’’ అని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 3 వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
డ్వాక్రా గ్రూపుల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా కలెక్టర్లు ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీసం రూ.లక్ష కోట్లమేర పెట్టుబడులు రావాలన్నారు. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమైతే.. 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. దావోస్‌కు వెళ్లేముందుగా 538 ఎంఓయూలు, రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండిరగ్ ప్రాసెస్ మొదలు కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ‘‘175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు వస్తాయి. మంత్రులు, కలెక్టర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను లాంచ్ చేసేలా కృషి చేయాలి. ఈ ప్రాజెక్టులన్నిటికీ భూసేకరణ అత్యంత కీలకం. మేం ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడూ భూవివాదాలు రాలేదు. భూములిచ్చే వారు కూడా సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. భూసేకరణలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. సేవల రంగం కూడా మరింతగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందాలంటే హోటళ్లు కూడా పెద్దఎత్తున నిర్మితం కావాలి. గిగ్ వర్కర్ల కోసం వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాలు కల్పించేలా కలెక్టర్లు కృషి చేయాలి. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లాన్ చేయండి. ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారకానికి మచిలీపట్నంలో 2 ఎకరాల భూమిని కేటాయించండి. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోనే టౌన్ షిప్ అభివృద్ధి చేయండి’’ అని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.















