- ప్రభుత్వ విధానం.. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’
- నిత్య విద్యార్ధుల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
- విమర్శలకు బెదిరేది లేదు… పీపీపీతోనే మెరుగైన వైద్యసేవలు
- 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్రగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా… ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకమని… కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలని సీఎం సూచించారు. ప్రతీ నిమిషం తనని తాను మరింత ఉన్నతంగా తీర్చిద్దుకుంటున్నానని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇకనుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
రాష్ట్ర సచివాలయంలో రెండు రోజులపాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో బుధవారం వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో చర్చలు మొక్కుబడిగా సాగకుండా… అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరపాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరారు.
ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం చూపాలి
ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘‘ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం. నీటి సమస్యలు, మద్ధతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావటంలాంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్దఎత్తున వచ్చాయి. ఇప్పుడు మనం నీటి భద్రత తెచ్చాం. రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా… తగ్గించాం. వ్యవస్థలో ఉండే లోపాలను అడ్డుపెట్టుకుని కొందరు పనిచేయకుండా తప్పించుకుంటున్నారు. రెవన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఫైళ్లను పరిష్కరించుకుండా తమ వద్దనుంచి వేరే వారికి పంపించేస్తున్నారు. ఇకపై ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం చూపాలి. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతీ శాఖ ఆన్‌లైన్ ద్వారా ఫైళ్లు నడపాలి, సేవలు అందించాలి. చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో అందరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలో మన చర్యలు ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.
పరిపాలనలో పవన్, లోకేష్ భేష్
ఇళ్లులేని పేదలు, రైతులు, మహిళలు, చిన్నారులు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేలా చర్చించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమన్నారు. మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం… కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందని సీఎం అన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డులేదని ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే… అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.9 కోట్లు మంజూరు చేయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగంనుంచి వచ్చినా… పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని, మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని ప్రశంసించారు. గత పాలకుల నిర్వాకంవల్ల నిర్వీర్యమైన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ పునరుద్ధరించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్… సూపర్ సక్సెస్
‘‘సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. పేదలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే అందిస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో ఒక్కో రైతుకు రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0, స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నాం… అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించటమే లక్ష్యం. ప్రివెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
వేగంగా అనుమతులు మన లక్ష్యం
విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అలాగే ఇప్పటివరకు రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులను ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదించామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ పెట్టుబడులతో 23 లక్షలకు పైగా ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తాయన్నారు. స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వచ్చిన పెట్టుబడులకు అనుమతులు, భూకేటాయింపుల విషయంలో కలెక్టర్లు కూడా వేగంగా స్పందించాలని సీఎం సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి వచ్చామని… పెట్టుబడులు పెట్టేవారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ అమలైతే జీఎస్డీపీలో 15 శాతం వృద్ధి సాధ్యమేనని సీఎం స్పష్టం చేశారు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ వృద్ధిని సులభంగా సాధించవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సుస్థిరమైన పాలన అందిస్తున్నారని, ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ గురించి ఆలోచన చేయకుండా ముందుకు వెళ్లటంలేదని సీఎం అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి వెన్నుముక ఐటీ రంగమని… ఇందుకు అవసరమైన ఐటీ నిపుణులకు రాష్ట్రంలో లోటు లేదని సీఎం స్పష్టం చేశారు.
పీపీపీలో నిర్మిస్తే.. ప్రైవేట్‌పరం కాదు
జిల్లా కలెక్టర్ల సమావేశంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం స్పష్టతనిచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలు మరింత మెరగవుతాయన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని… అయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు. 70 శాతంమందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లోనే అందుతున్నాయని, సీట్లు కూడా పెరిగినట్టు వివరించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, అవే డబ్బులతో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి ఉండేదన్నారు. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని వివరించారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని… అలాగని అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా? అని సీఎం ప్రశ్నించారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలియచేయాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని సీఎం ఎద్దేవా చేశారు. 13, 14 శాతంమేర అత్యధిక వడ్డీలతో అప్పులు తెచ్చి సమస్యలు సృష్టించారని, అనాలోచిత విధానాలతో అనవసరపు ఖర్చు పెరిగిందన్నారు. ఇప్పుడు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో అప్పులు రీ-షెడ్యూలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. చివరికి గత ప్రభుత్వంనుంచి వారసత్వంగా వచ్చిన 70శాతం ధ్వంసమైన రోడ్లను కూటమి ప్రభుత్వంలో మరమ్మతులు చేసి, కొత్తగా రోడ్లు వేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.














