- ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనాలు అవసరం
- రసాయిన వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత పాటించాలి
- 100 రోజుల ప్రణాళికతో మత్స్యకారుల సమస్యకు పరిష్కార అన్వేషణ
- కాలుష్య నియంత్రణ ప్రణాళిక.. దేశానికి మోడల్ కావాలి
- కాలుష్య నియంత్రణ సమీక్షలో డిప్యూటీ సీఎం దిశానిర్దేశం
మంగళగిరి (చైతన్య రథం): పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీరప్రాంతంతోపాటు కాకినాడ జిల్లా పరిధిలోని పారిశ్రామిక కాలుష్యం, నివారణకు అనుసరించాల్సిన ప్రణాళికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారుల ఆందోళన అర్థం చేసుకుని.. అక్కడి పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమస్యవున్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలంటూ, అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసి.. 100 రోజుల ప్రణాళికను తక్షణం అమలు చేయాలన్నారు. కాకినాడ తీరప్రాంతంలో కాలుష్య నియంత్రణకు తీసుకోబోయే చర్యలు.. ఒక మోడల్గా దేశం మొత్తం పాటించేలా ఉండాలన్నారు. శనివారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో తీర ప్రాంత కాలుష్యం, పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత, కాకినాడలో మత్స్యకారులతో జరిగిన ‘మాట.. మంతి’ కార్యక్రమంలో మత్స్యకారులు ప్రస్తావించిన సమస్యలు తదితర అంశాలు సమీక్షలో చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా అడుగులేస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి.
అయితే పెరుగుతున్న పరిశ్రమలతోపాటు ప్రజల్లో ఆందోళనలు, సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తీరప్రాంతాల వెంబడివున్న పరిశ్రమలనుంచి వెలువడే రసాయిన వ్యర్ధాలు తమ జీవనోపాధిని దెబ్బ తీస్తుందన్న ఆందోళనలు మత్స్యకారుల్లో ఉన్నాయి. ఉప్పాడ తీరప్రాంత గ్రామాల మత్స్యకారులు ఆందోళన చేయడానికి అదే ప్రధాన కారణం. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జరిగిన మాటా.. మంతిలో రసాయన వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలిపేయడం కారణంగా వారు ఇబ్బందులుపడుతున్నామని చెప్పారు. మత్స్యకారుల్లో సందేహాలు నెలకొన్న క్రమంలో వారి సూచనల మేరకు తక్షణం ఆయా పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలి. ఆ పరిశ్రమలు ఏమేరకు కాలుష్యాన్ని సముద్రంలో కలుపుతున్నాయి, జల వాయు కాలుష్యం ఎంత? అనే అంశాలపై అధ్యయనం చేపట్టి సమగ్ర నివేదిక రూపొందించాలి. పరిశ్రమలు సముద్రంలోకి విడుదల చేసే వ్యర్థ జలాలపై పర్యవేక్షణ విషయంలో పారదర్శకతతో వ్యవహరించాలి. పర్యవేక్షణ బృందాల్లో విద్యావంతులైన స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలి. కాలుష్య నియంత్రణ పద్ధతులలో, ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆధునీకరించి నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంపై పారిశ్రామికవేత్తలూ దృష్టి సారించాలి. ఎప్పటికప్పుడు పొల్యూషన్ ఆడిట్ నిర్వహించి ఏదైనా సమస్య గుర్తిస్తే దాన్ని సరి చేసుకునే విధంగా ఆయా కంపెనీలను ఆదేశించాలి. ఇందుకు సంబంధించి పీసీబీ, ఇతర స్టేక్ హెూల్డర్స్ తో కలసి 100 రోజుల్లో పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాల”ని సూచించారు.
ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సిబ్బంది కొరత సమస్యను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. పెరుగుతున్న అవసరాలకు అను గుణంగా పీసీబీలో సిబ్బందిలేరని, పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో చాలా తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నట్టు తెలిపారు.పవన్ స్పందిస్తూ”అవసరాలకు అనుగణంగా సిబ్బంది నియామకం చేపట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తాం. ప్రస్తుతమున్న సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించు కుని పరిశ్రమల్లో కాలుష్య తీవ్రత నిర్ధారించడం, నివారించడంపై దృష్టి సారించాలి” అన్నారు. పారిశ్రామిక వర్గాలు సైతం కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాలని, అభివృద్ధి చెందిన దేశాలు రసాయన వ్యర్థాల నిర్వహణలో అమలు చేస్తోన్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకోవాలని, అవసరమైతే పర్యావరణ ప్రేమికులు, పర్యావరణవేత్తలను ఆహ్వానించి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య, మెంబర్ సెక్రటరీ ఎస్ శరవణన్, సీనియర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.