- కరువు ప్రాంతాల్లో పంట కుంటలు, చెక్ డ్యాముల నిర్మాణం
- సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం, భావితరాలకు నీరు అందించాల్సిన బాధ్యత మనదే
- భూగర్భ జలాలు పెంపొందించే క్రతువులో ప్రజలంతా భాగస్వాములు కావాలి
- మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపు
ఒంగోలు (చైతన్యరథం): భూగర్భ జలాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జల శక్తి కేంద్రాన్ని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ లతో కలిసి మంత్రి డోలా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న నీటి సంరక్షణ కార్యక్రమాల నమూనాలను పరిశీలించారు. అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్మించనున్న రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ప్రకాశం జిల్లా మొత్తం క్షామపీడిత ప్రాంతమని, జిల్లాలో నీటి సంరక్షణ చాలా అవసరం అన్నారు. భావితరాలకు నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అత్యంత విలువైన సహజ వనరు సంపద ఏదైనా ఉందంటే అది నీరేనని మంత్రి అన్నారు.
సమస్త జీవకోటికి నీరే ప్రాణాదారమని, భావితరాలకు నీరందించాల్సిన బాధ్యత మనదే అని మంత్రి అన్నారు. ప్రజలకు జీవనాధారమైన నీటి సంపదను సంరక్షించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడం, పచ్చదనాన్ని నిర్మూలించడం వంటి కారణాలతో నేడు మనమంతా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయన్నారు. అందులో భాగంగా కరువు ప్రాంతాల్లో పంటకుంటలు, చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతల నిర్మాణాలతో పాటు ఇంటిపై రూఫ్ వాటర్‌ని నిల్వ చేసేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాలో నీటి గణాంకాల ప్రకారం 12 మండలాల్లో 93 గ్రామాల్లో భూగర్భ జలాలు బాగా అడుగంటాయని, ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. డ్వామా అధికారులు నీటి సంరక్షణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి, జిల్లాలో నీటి సంరక్షణ కార్యక్రమాలను పటిష్టంగా అమలు జరిగేలా కృషి చేయాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు చేపట్టే నీటి సంరక్షణ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.
అనంతరం…కొండపి నియోజక వర్గం, సింగరాయకొండ మండలం, కనుమళ్ళ గ్రామంలో నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఫారం పాండ్ ( పంట కుంట) కు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ పై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం సింగరాయకొండలో రూ.2.30 లక్షలతో నిర్మించిన ఫారం పాండ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జోసఫ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మా నాయక్, తదితరులు పాల్గొన్నారు.