- భారీగా పెరిగిన పోలింగ్
- ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
- గెలుపుపై కూటమి అభ్యర్థుల ధీమా
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ సాఫీగా జరిగింది. కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలోని 33 నియోజకవర్గాలు, గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. రెండు చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికారులు 939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి 69.57 శాతం పోలింగ్ నమోదయింది. పట్టభద్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు వేసేందుకు తరలిరావడంతో భారీ పోలింగ్ నమోదైంది. ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని.. తప్పకుండా విజయం సాధిస్తానని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో నమోదైన 59.95 శాతంతో పోలిస్తే ఈసారి 10 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడిరచారు. ఈ ఎన్నికల్లో 3,47,116 మంది ఓటర్లకు గాను.. 2,41,502 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. ఏలూరు జిల్లాలో 73.30శాతం, కృష్ణా జిల్లాలో 69.91శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 65.69 శాతం, గుంటూరు 66.45 శాతం, బాపట్ల 74.30 శాతం, పల్నాడు 77.33 శాతం పోలింగ్ నమోదైంది.
గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి 63.28 శాతం పోలింగ్ నమోదయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో 22,493 ఉపాధ్యాయ ఓటర్లుండగా 91.82 శాతం పోలింగ్ నమోదయింది. బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.