మచిలీపట్నం (చైతన్యరథం): కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు చేసిన చెక్కుల్ని ఆదివారం బాధితులకు అందజేశారు. మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా రూ.29 లక్షల విలువైన చెక్కుల్ని 14 మందికి అందజేశారు. వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురైన వారికి అండగా నిలవడమే లక్ష్యంగా గతంలో అమలు చేసిన సీఎంఆర్ఎఫ్ను జగన్ రెడ్డి రాజకీయ కక్షల కోసం రద్దు చేశారని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు. వేలాది మంది బాధితులకు సాయం అందించకుండా దగా చేశారు. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎంఆర్ఎఫ్ వ్యవస్థను పునరుద్ధరించి మచిలీపట్నం నియోజకవర్గానికి రూ.29 లక్షలు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. వైద్యారోగ్య వ్యవస్థను జగన్ రెడ్డి నిర్వీర్యంచేస్తే.. చంద్రబాబు వైద్య సేవల్ని పెంచడమే కాకుండా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారన్నారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో స్కానింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే మరిన్ని మెరుగైన వైద్య సేవల్ని ఆస్పత్రుల్లో అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలి
సచివాలయాల అడ్మిన్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం మచిలీపట్నంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని, పింఛన్ల పంపిణీ సజావుగా సాగేందుకు వారు ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. సచివాలయానికి అడ్మిన్ నాయకుడు లాంటివాడని, సచివాలయంలోని మిగిలిన సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బందరు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. బందరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి ‘నా బంగారు బందరు’ కార్యక్రమంతో శ్రీకారం చుట్టామని, నగరంలోని ప్రతి డివిజన్ను స్వచ్ఛ డివిజన్ గా తయారు చేయడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నామని, ఆ దిశగా సచివాలయ ఉద్యోగులు పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రతి సచివాలయ ఉద్యోగి వారి పరిధిలోని సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని, అందుకు ప్రతిరోజు వారు క్షేత్రస్థాయిలో సందర్శించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. సీసీి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, అంగన్వాడి, మున్సిపాలిటీ పాఠశాలలకు మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన నిధులను సమకూరుస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, దానిని సద్వినియోగం చేసుకునే విధంగా పట్టభద్రులకు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ గొర్రెపాటి గోపీచంద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, ఇలియాజ్ బాషా, పల్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి సోమశేఖర్, పలువురు కార్పొరేటర్లు, సచివాలయ అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు.