చిత్తూరు (చైతన్య రథం): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ రౌడీమూకల దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండిరచారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. ‘విధి నిర్వహణలోవున్న మీడియా ఫోటోగ్రాఫర్‌పై తీవ్రస్థాయిలో దాడిచేసి గాయపరచడం అమానుషం. ప్రస్తుతం చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాను. ఇప్పటివరకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అందుతున్న చికిత్స గురించి మాట్లాడాను. శివకుమార్‌కు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. నాయకుల ప్రోద్భలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ వివరిస్తుంటే చాలా బాధ కలిగింది. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. శివకుమార్‌పై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.