- చీపురుపల్లిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న చంద్రబాబు
- అనంతరం రావివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
- మధ్యాహ్నం ప్రజావేదిక సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 09.30కు అమరావతినుంచి బయలుదేరి 11.10 గంటలకు చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామానికి చేరుకుంటారు. 11.30 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకుంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చిన బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.45 లక్షలమంది బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.
12 గంటలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్లోని అజ్మీర్నుంచి ప్రారంభిస్తారు. జాతీయస్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీఎం రావివలసలో పాల్గొంటారు. తర్వాత ఏపీలో చేపట్టనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.50కి రావివలసలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి పేదలకు పింఛన్ల పంపిణీ చేస్తారు. అనంతరం సాయంత్రం 3.15 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. జిల్లా పర్యటన అనంతరం రాత్రి 7.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.













