- వెంటవెళ్లనున్న లోకేశ్, భరత్, నారాయణ
- పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన అజెండా
- సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి విధానాల మార్పిడి లక్ష్యం
అమరావతి (చైతన్య రథం): ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన అజెండాగా ఈనెల 26నుంచి 30వరకు పర్యటించనున్నారు. రాజకీయ, వ్యవస్థీకృత, వ్యాపార వర్గాలతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్, అధికారులు కాటమనేని భాస్కర్, ఎన్ యువరాజ్, కార్తికేయ మిశ్రా, కె కన్నబాబు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డునుంచి సాయికాంత్ వర్మ ఉంటారు.
రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను విస్తరించడమే సీపం టీం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పర్యటనలో ప్రధానంగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఏపీకి ఆహ్వానించడంతోపాటు, ఏపీ సర్కారు రూపొందించిన పాలసీనలను వివరించి పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ వ్యాపార సంస్థల డెలిగేట్లతో సీఎం టీం భేటీలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలోవున్న పెట్టుబడి అవకాశాలను వివరించడం.. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విస్తృత ప్రోత్సాహకాలను వివరిస్తారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, స్పేస్ రంగం, మౌలిక సదుపాయాలువంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చురుకుగా ప్రయత్నించనున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి విధానాల మార్పిడి లక్ష్యం
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా పునరుద్ధరణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలను కార్యాచరణగా మలచుకున్నారు. గతంలో విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలమయ్యారు. అలాగే, సింగపూర్ పర్యటన ద్వారా ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు, అక్కడి అభివృద్ధి మోడళ్లను కూడా అధ్యయనం చేసి.. రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రానికి ఆర్థిక ప్రగతితో పాటు, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కూడా కల్పించనుంది. అలాగే, నగర ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనతోపాటు భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం తదితర అంశాలపై చంద్రబాబు సారథ్యంలోని బృందం.. సింగపూర్‌లోని వివిధ రంగాల ప్రముఖలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. పర్యటన వివరాలను తెలుపుతూ.. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని ఒప్పందాలపై చర్చిస్తారా?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. రాష్ట్ర రాజధానిగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, వెలగపూడి తదితర 29 గ్రామాలను ఎంపిక చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు… నాటి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు గెలిపించడంతో.. గద్దెనెక్కిన జగన్ ‘రాజధాని అమరావతి’ని నిర్లక్ష్యం చేశారు. ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించిన జగనే.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట, మడం రెండూ తిప్పేశారు. ఏపీకి మూడు రాజధానులంటూ అసెంబ్లీ సాక్షిగా కొత్తపాట అందుకోవడంతో.. టీడీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ వెనక్కిపోయాయి. జగన్ ప్రకటనతో రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ప్రజలపట్ల నాటి జగన్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. తిరిగి 2024లో అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా విజయం సాధించాయి. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో రాజధాని అమరావతి పనులు మళ్లీ పరుగందుకున్నాయి. అటు కేంద్రం అందిస్తోన్న సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతోన్న సమయంలో.. సీఎం చంద్రబాబు తన కేబినెట్ సహచరులతోపాటు ఉన్నతాధికార ప్రతినిధి బృందంతో సింగపూర్ పర్యటనకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈలోగా ఢల్లీ టూర్‌కు సీఎం..
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీకి పయనమవుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్రంలోని పెద్దలను కలిసి రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులను వివరించి.. కేంద్ర గ్రాంట్లపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయలతోపాటు, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్‌తో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చించనున్నారు. 15న మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతో ముఖ్యమంత్రి వరుసగా భేటీ అవుతారు. 16న కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్‌లో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఇతర కార్యక్రమాలు సైతం ముగించుకుని.. 17న ఉదయం 9.30కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతి చేరుకుంటారు.