- ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయం ఘటన
- సీఎం ఆదేశాలతో ఈవో మురళీకృష్ణ సస్పెన్షన్
- చౌర్యం కేసు నమోదు… అరెస్ట్
- తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలే
- స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలో గంగమ్మ గుడిలో ఆలయ ఈవోనే చోరీ చేసిన ఘటనపైప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలిచ్చింది. గుడిలో 5 కిలోల వెండి ఆభరాణలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను అదే దేవాలయం ఈవో మురళీ కృష్ణ చోరీచేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆలయ ఈవోనే చోరికి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన ఈవో మురళీ కృష్ణను సస్పెండ్
చేయాల్సిందిగా దేవదాయ అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఈవో మురళికృష్ణను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉన్నతాధికార్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే చోరీకి ప్రయత్నించిన ఈవో
మురళీకృష్ణపై కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. స్థానిక దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక విచారణలో చోరీ నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు.భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠినంగా
చర్యలు తీసుకోవాలని సీఎంచంద్రబాబు స్పష్టం చేశారు.














