- మూడుగంటలపాటు ఇంటింటి ప్రచారం
- ఆత్మీయ స్వాగతం పలికిన తిమ్మరాజుపల్లి
- ప్రభుత్వ పనులు, లక్ష్యాలు వివరించిన చంద్రబాబు
- పీ-4కు సహకరిస్తామన్న ‘మార్గదర్శు’లు
- సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఆదేశాలు
చిత్తూరు/ తిమ్మరాజుపల్లె (చైతన్య రథం): ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా కుప్పం పర్యటనలోవున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. బుధవారం రాత్రి సమయంలో కూడా ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. అలుపెరుగని ముఖ్యమంత్రి చంద్రబాబు.. గడప గడపకూ వచ్చి పలకరిస్తుంటే `తిమ్మరాజుపల్లె మురిసిపోయింది. ప్రచారానికి ఊరు మొత్తం చంద్రబాబు వెంట కదలి వెళ్లింది. సీఎం చంద్రబాబు వెంట ఎంపీ దుగ్గిమళ్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడపిడి వికాస్ మర్మత్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ‘డోర్ టు డోర్’ చంద్రబాబు వివరించారు. త్వరలో ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలనూ వివరిస్తూ.. ఏపీని ప్రగతి పథాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ప్రతి ఇంట్లోనూ చదువుకుంటున్న పిల్లల గురించి.. ‘ఏం చదువుతున్నారు. చదువెలా సాగుతోందని’ కుశలంగా ప్రశ్నిస్తూ.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చైతన్యపర్చారు. కష్టాల్లోవున్న ఓ కుటుంబం పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు `ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చదివిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీస్తూ… ‘తల్లికి వందనం’ పథకం ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ అందిందా? అందుతుందా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే తమ ఖాతాలలో సొమ్ములు పడ్డాయని ఆనందంగా చెబుతున్న తల్లులను చూస్తూ మురిపెంగా నవ్వుకుంటూ ముందుకు కదిలారు. కుటుంబాల ఆరోగ్యం.. కుటుంబంలోని వృద్దుల పరిస్థితిపై ఆరా తీస్తూ.. ప్రతి ఇంటి పెద్ద కొడుకులా వివరాలు తెలుసుకున్నారు. తిమ్మరాజుపల్లిలో ఇంటింటి ప్రచారం చేపట్టిన సీఎం చంద్రబాబుకు గ్రామస్థుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. చాన్నాళ్ల తరవాత ఇంటికొచ్చిన పెద్ద కొడుకును ఆహ్వానించినట్టు.. సీఎం చంద్రబాబుకు హారతులిచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు. చేయని తప్పునకు చంద్రబాబు జైలుకెళ్లిన రోజులను గుర్తు చేసుకుని గ్రామస్థులు విలవిల్లాడారు. రాముడు అజ్ఞాత వాసం చేసినట్టే.. మీరూ 53 రోజులు అజ్ఞాతవాసం చేశారంటూ చంద్రబాబుపైవున్న ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తం చేశారు. ‘మీరు జైల్లో ఉన్నన్ని రోజులూ ఉపవాసం ఉన్నానని ఓ వృద్ధుడు గాఢతతో చెప్తుంటే చంద్రబాబు చలించిపోయారు. ‘మీలాంటివారి అభిమానమే నన్ను ఉత్సాహంగా పరుగు పెట్టిస్తోందని చంద్రబాబు ఆ వృద్ధుడిని ఓదార్చారు. నిరుపేదరహిత రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్థితిమంతులైనవారు పేదలను ఆదుకోవాలని కోరుతూ.. పేదలను ఆదుకునేందుకు పీ-4ను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించిన తిమ్మరాజుపల్లె గ్రామస్థులు చల్లా మంజు, చల్లా బాలసుబ్రహ్మణ్యం ముందుకొచ్చి.. శక్తికొద్దీ పేద కుటుంబాలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాళ్లను ముఖ్యమంత్రి అభినందిస్తూ.. ‘మీలాంటివారి కోసమే అన్వేషిస్తున్నా. ధనవంతులు పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తే.. పేదలు మరింత అభివృద్ధి చెందుతారని చంద్రబాబు ఉద్ఘాటించారు. పీ-4తో రాష్ట్రవ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే తమ ముందుకు రావడంతో.. గత ప్రభుత్వంలో తాముపడిన ఇబ్బందులను సీఎం చంద్రబాబుకు గ్రామస్తులు ఏకరువు పెట్టారు. సుమారు మూడు గంటల పాటు తిమ్మరాజుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సీపం చంద్రబాబు, ప్రభుత్వం చేపడుతోన్న మరిన్ని కార్యక్రమాలను వివరించారు. త్వరలో అమలు చేయబోయే పథకాలను వివరిస్తూ.. గ్రామస్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. గ్రామస్తుల సాదకబాధకాలు వింటూ.. తక్షణం పరిష్కరించదగ్గ వాటిపై అధికారులకు ఆదేశాలిస్తూ `ముఖ్యమంత్రి చంద్రబాబు తిమ్మరాజుపల్లెలో కలియతిరిగారు. పశువులను పెంచుకునేందుకు ఇళ్లవద్ద స్థలంలేని వారికోసం గ్రామంలో పశువుల షెడ్, మేతకు అవసరమైన వనరులు సమకూర్చాలంటూ అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం బోర్లు కావాలని పలువురు గ్రామస్తులు కోరడంతో.. తక్షణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కళాశాలల్లో సీట్లు కావాలంటూ పలువురు గ్రామస్థులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసుకున్నారు. విసుగు, విరామమన్నది లేకుండా గ్రామస్థులు చెప్పే ప్రతి సమస్యనూ సావధానంగా వింటూ సీఎం చంద్రబాబు సాగించిన ‘డోర్ టు డోర్’ సాగించిన ప్రభుత్వ పాలనా విజయాల ప్రచారం దిగ్విజయంగా సాగడమే కాదు, సీఎం ఉత్సాహం పలువురిని విస్మయానికి గురి చేసింది.