- చేపలవేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపు
- రూ.259 కోట్లతో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి
- టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మత్స్యకారులకు లబ్ధి
- రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
అమరావతి (చైతన్యరథం): చేపల వేట నిషేధ సయమంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తూ, మరో ఎన్నికల హామీని సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చారని, మత్స్యకారులను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆది నుంచి టీడీపీ హయాంలోనే మత్స్యకారులకు మేలు జరుగుతోందన్నారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించే వారన్నారు. మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు… గత ఎన్నికల ముందు చేపల వేట నిషేధ సయమంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేలను రెట్టింపు చేసి రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున రూ.259 కోట్లను అందజేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
మా ప్రభుత్వ హయాంలోనే మత్స్యకారులకు లబ్ధి
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశ పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత గుర్తు చేశారు. 2014లో తొలిసారిగా మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించారన్నారు. 2014-19 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం ఆనాటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం రూ.788 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆ నిధులతో పాటు వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా అందజేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు చేపల వేట సమయంలో ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నామన్నారు. చేపల వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయని, ఆయా గ్రామాల అభివృద్ధికి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందన్నారు. ఫిష్ ఆంధ్ర అంటూ రూ.300 కోట్లు ఖర్చు చేసినా, ఒక్క మత్స్యకారుని కుటుంబానికి కూడా ఎటువంటి మేలు జరగలేదని మంత్రి సవిత మండిపడ్డారు.
చేపల ఎగుమతుల్లో మనమే టాప్
చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రమే ముందు వరుసలో ఉందని మంత్రి సవిత వెల్లడిరచారు. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29 శాతం ఏపీ నుంచే ఉంటోందన్నారు. మత్స్య సంపద ఎగుమతుల్లో 32 శాతం ఏపీ నుంచే జరుగుతోందన్నారు. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆదివారం ఒక ప్రకటనలో మంత్రి సవిత తెలిపారు.