న్యూఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతమైందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. కేంద్ర మంత్రులతో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఈ అంశాలను వివరించారు. వ్యవసాయంపై ఆధారపడిన ఏపీలో గోదావరి – పెన్నా అనుసంధాన ప్రాజెక్ట్ ముఖ్యమైనదన్నారు. ఈ ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. నదుల అనుసంధానానికి అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. నదుల అనుసంధానంతో వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్‌లోని క్షామ పీడిత ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారని చెప్పారు.
అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందున భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి, ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై కేంద్ర మంత్రి జై శంకర్‌తో చంద్రబాబు చర్చించారు. విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని, పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కోరాం. విదేశీ సంస్థలను ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్ర మంత్రి జై శంకర్ హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణంలో గతంలో సింగపూర్ భాగస్వామ్యమైంది. సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సీఎం కోరారు. అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు.