- పరిశ్రమలకు అవసరమైన వర్క్త్ఫోర్స్ కోసమే స్కిల్ సెన్సెస్ ప్రాజెక్ట్
- రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం
- ముంబయి రోడ్ షో లో పెట్టుబడిదారుల సందేహాలకు మంత్రి లోకేష్ సమాధానాలు
ముంబయి (చైతన్యరథం): రాష్ట్రానికి పెద్దఎత్తున తరలివస్తున్న పరిశ్రమలకు నైపుణ్యాలను సమకూర్చేందుకే స్కిల్ సెన్సస్ ప్రారంభించాం, దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను అంచనావేసి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. నవంబర్లో విశాఖలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ముంబయిలో నిర్వహించిన రోడ్ షో లో పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. నైపుణ్యం పోర్టల్ను నవంబర్లో ప్రారంభించబోతున్నా మన్నారు. దీనిద్వారా పరిశ్రమదారులు, యువత, స్కిల్ భాగస్వాములు ఒకే వేదికపైకి వస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కేజీ టు పీజీ వరకు కరిక్యులమ్ సమూల మార్పులు తెస్తాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. యూఏఈతో మా భాగస్వామ్యం చాలా బలంగా ఉంది. త్వరలో ముఖ్యమంత్రి యూఏఈ వెళ్లి అక్కడ పరిశ్రమదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. దీనిద్వారా ఇరుదేశాల నడుమ సహకారాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తున్నాం. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్లిన సింగపూర్ తిరిగి తమ ఒప్పందాలను పునరుద్ధరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్కు ప్రపంచస్థాయి బ్రాండ్ తేవాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి లోకేష్ తెలిపారు.
స్టార్టప్ ఎకో సిస్టమ్
వ్యవసాయాధార రాష్ట్రమైన ఏపీలో హార్టీకల్చర్, పంట వైవిధ్యీకరణపై దృష్టిపెట్టాం. రాయలసీమలో అరటి, మామిడి వంటి వాటిని పంటలను ప్రోత్సహిస్తున్నాం. అదే సమయంలో డ్రాగన్ ఫ్రూట్, కర్జూరం వంటి పంటలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. డెయిరీ, అరకు కాఫీ, మిర్చి, పసుపు వంటి వ్యవసాయాధార పరిశ్రమల్లో కూడా భారీ పెట్టుబడులను ఆకర్షించాం. రైతు జీవన నాణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఏపీలో స్టార్టప్ ల ప్రోత్సాహకానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రత్యేక మెంటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నోడ్లో ఒక పెద్ద పరిశ్రమకు అనుసంధానంగా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాం.
అవసరమైన చోట మార్కెట్ యాక్సెస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చర్యల ద్వారా స్టార్టప్ ఎకో సిస్టమ్ ను నిర్మిస్తున్నాం. ఉక్కు, మెడికల్ డివైస్, ఫార్మా, క్రీడా రంగాల వారీగా ప్రోత్సహించడం, విద్యాసంస్థలను రప్పించచడానికి ప్రత్యేక హబ్ లను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రానికి స్పష్టమైన స్టార్టప్ పాలసీ ఉంది. ఇందుకు ఇంక్యుబేటర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తోంది. ఐటీ రంగంలో 35 శాతం గ్లోబల్ టాలెంట్ భారతదేశానిది కాగా, దేశంలో 40శాతం ఐటీ నిపుణులు ఏపీ నుంచే తయారవుతున్నారు. విశాఖపట్నం, అమరావతిలో బిట్స్, విట్, ఎస్ఆర్ఎం, ఐఐటీ వంటి సంస్థలు వస్తున్నాయి. నైపుణ్యం ప్లాట్ ఫాం ద్వారా మనకు తక్షణమే అవసరమైన నిపుణులు అందుబాటులో ఉంటారు. పరిశ్రమలకు ఏం అవసరమో తెలియజేస్తే వారికి అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ చెప్పారు.