- శ్రీ సత్య సాయిబాబా శత జయంత్యుత్సవాలకు హాజరు
- కడపనుంచి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల
- 46.85 లక్షలమంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్ల జమ
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి చేరుకున్న ముఖ్యమంత్రి.. రాత్రికి అక్కడే బస చేస్తున్నారు. బుధవారం ఉదయం 9.25 నిముషాలకు పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వాగతం పలుకుతారు. అక్కడినుంచి ప్రధాని మోదీతో కలిసి శ్రీసత్య సాయిబాబా శత జయంతి. వేడుకలకు హాజరవుతారు. 10 గంటలకు సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని ఇరువురు నేతలు దర్శించుకుంటారు. అనంతరం శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే శతజయంత్యుత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హాజరవుతారు. ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం 1.15 గంటలకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రికి సీఎం చేరుకోనున్నారు. స్థానికంగా గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి.. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. అన్నదాత సుఖీభవ- పీఎం కెసాన్ పథకం రెండో విడతలో రూ.7 వేలు చొప్పున 16,85,838 మంది రైతుల ఖాతాలకు రూ. 3,135 కోట్లను జమ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2న మొదటి విడతగా రూ.7 వేలను ప్రభుత్వం జమ చేసింది. నేడు రెండో విడతగా మరో రూ.7 వేల చొప్పున రైతులకు ప్రభుత్వం జమచేయనుంది. రెండు విడతల్లో మొత్తంగా రూ.6,309.44 కోట్లమేర ఆర్ధిక ప్రయోజనం రైతులకు కలుగుతోంది. కార్యక్రమం అనంతరం స్థానిక కేడర్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అక్కడినుంచి సీఎం చంద్రబాబునాయుడు బుధవారం రాత్రికి అమరావతికి చేరుకుంటారు.











