- సాదరంగా ఆహ్వానించిన స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్
- మర్యాదపూర్వకంగా కలిసిన సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, అసోం సీఎం హేమంత్ విశ్వశర్మ, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా
- యూరప్‌లోని 20 దేశాలనుంచి తరలివచ్చిన తెలుగుప్రజలు, ఎనఆరఐ టీడీపీ కార్యకర్తలు
జ్యూరిచ్/స్విట్జర్లాండ్(చైతన్యరథం): దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విమానాశ్రయం స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వశర్మ, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా మర్యాద పూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకి జ్యూరిచ్ విమానాశ్రయంలో తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు యూరప్‌లోని 20 కి పైగా దేశాల నుంచి తెలుగు ప్రజలు, ఎనఆరఐలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు దిగి కాసేపు సంభాషించారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
జ్యూరిజ్ విమానాశ్రయంలో తనకు లభించిన ఘనస్వాగతంపై ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. జ్యూరిచ్ లో తనకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు వారికి, ఎన్నారై టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా యూరోప్ లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి నా పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మన తెలుగు భాషకు, సంస్కృతికి, వారసత్వానికి అచ్చమైన ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.













