` సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
` షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు
` మరిన్ని పెట్టుబడులకు మారిటైం పాలసీలో మార్పులు
` పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. ఎయిర్ పోర్టులు-పోర్టుల అభివృద్ధి, మారిటైం పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు, లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నామన్నారు. ఆపరేషనల్‌గా ఉన్న పోర్టులు, ఎయిర్ పోర్టుల నుంచి పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రతి పోర్టు, ఎయిర్ పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్ షిప్పులను అభివృద్ధి చేయాలి. దీనివల్ల కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. తద్వారా సంపద సృష్టి జరుగుతుంది. ఈ తరహా సమీకృత అభివృద్ధి ఎక్కడెక్కడ చేయగలమో..ఏ విధంగా చేయగలమనే అంశాలపై బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకోవాలి. ఇదే సమయంలో సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డు, రైలు, ఎయిర్ కార్గో, ఇన్‌ల్యాండ్, మారిటైమ్ కార్గోలకు ఏపీనే కేంద్రంగా ఉండాలి. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏపీనే కేంద్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో అన్ని రకాల సరుకు రవాణా మార్గాలు అందుబాటులో ఉంటే…అభివృద్ధి వేగంగా జరుగుతుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులకు అనుసంధానంగా నేషనల్ హైవే కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా ఉండాలి. అలాగే ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ కనెక్టివిటీ కూడా ఉంటే…రాష్ట్రం నుంచే సరుకు రవాణా ఎక్కువగా జరుగుతుంది. కేంద్రం వద్ద నేషనల్ హైవేలకు, రైల్వేలకు నిధుల కొరత లేదు. మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు పంపితే నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
మౌలిక సదుపాయాల చోదక శక్తిగా..
రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను సమర్థంగా నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పోర్టులు, ఎయిర్ పోర్టుల సమీపంలో శాటిలైట్ టౌన్ షిప్పుల అభివృద్ధికి అవసరమైన సంస్థలను గుర్తించి పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలి. లాజిస్టిక్ కార్పొరేషన్ అనేది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ మాదిరిగా ఉండాలి. ఇదే తరహాలో 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకుంటున్న ఎంఎస్‌ఎంఈ పార్కుల వద్ద కూడా శాటిలైట్ టౌన్ షిప్పులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేయాలి. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలి. అనుకున్న సమయానికి భూసేకరణ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలి. ఈ ఎయిర్ పోర్టులను నేషనల్ హైవేలను కలిపేలా అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలి. అవసరమైతే వయబిలిటీ గ్యాప్ ఫండిరగ్ ద్వారా దీనిని చేపట్టాలని సీఎం చెప్పారు.
మారిటైం పాలసీలో మార్పులు
పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా మారిటైమ్ విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పోర్టులు, టెర్మినల్స్, షిప్ బిల్డింగ్ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్ టెర్మినళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్కీం పాలసీకి అనుగుణంగా మారిటైం పాలసీలో మార్పులు చేసుకోవాలని అధికారులు చెప్పటంతో ఈ మేరకు అవసరమైన మార్పులు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం కోసం మచిలీపట్నం, మూలపేట, చినగంజాం వంటి ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ యూనిట్లు ఎన్ని చోట్ల ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందో చూడాలన్నారు. పోర్టుల నిర్మాణం, షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం చేసే సమయంలో స్థానిక మత్స్య కారులకు ఇబ్బంది లేకుండా చూడాలి. మత్స్య కారులకు సంబంధించిన పనిముట్లు, పరికరాలను పెట్టుకోవడానికి వీలు కల్పించేలా ఉండాలి. కంటైనర్ పోర్టుల ఏర్పాటు, అభివృద్ధిపై మీద మరింత దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల కంటైనర్ పోర్టు తమిళనాడుకు వెళ్లిపోయింది. అలాంటి పరిస్థితులు రాకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.