- నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
- క్రిమినల్ కేసులు నమోదు
అమరావతి (చైతన్యరథం): కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు.
కాగా లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తూ ఈ నెల 9న కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్థన్‌కు ఓ విద్యార్థిని నుంచి మెయిల్ వచ్చింది. లైంగిక వేధింపులకు సంబంధించి ఈ నెల 8న కొందరు విద్యార్థినులు ఫ్యాకల్టీ వద్ద విలపించడంతో కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు.
మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరును దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు బయటపెట్టారు. నలుగురు ఉద్యోగులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కల్యాణ్ చక్రవర్తిపై ఎక్కువ ఫిర్యాదులు అందాయి. వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ, నీచపు వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించాం. కొంతమంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు కల్యాణ్ చక్రవర్తితో పాటు జమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారిపైనా చర్యలు తీసుకున్నాం. వారిని సస్పెండ్ చేసిన అనంతరం విచారణ చేపట్టాం. కళాశాలలో గతంలో ఇలాంటివి జరిగాయా? అనే కోణంలో విచారించాం. వేధింపులపై మెయిల్ పంపిన విద్యార్థినిని అభినందిస్తున్నామని అని జిల్లా కలెక్టర్ తెలిపారు.
మూడు ఫిర్యాదులు అందాయి: ఎస్పీ బిందుమాధవ్
ఈ ఘటనపై శుక్రవారం ఉదయం నుంచి మూడు ఫిర్యాదులు అందాయని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2, టూ టౌన్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు వచ్చిందన్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.