` రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదేవత మోదకొండమ్మను ప్రార్థించా
` తోటల మధ్య అద్భుతమైన అరకు కాఫీ రుచి చూశా
` ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల మధ్య గడపటం ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాను. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నాను. గ్రామంలోని గిరిజన సోదరులు సాగు చేసే కాఫీ తోటకు వెళ్లి వారితో మాట్లాడి సాగు విధానం, ఆదాయం గురించి తెలుసుకున్నాను. కాఫీ రైతులతో కలిసి తోటల మధ్య అద్భుతమైన అరకు కాఫీ రుచి చూశాను. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రానున్న రోజుల్లో ఏజెన్సీలో చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు వివరించానని సీఎం చంద్రబాబు తన పోస్ట్‌లో తెలిపారు.