- పెట్టుబడుల సాధనకు సీఎం మూడు రోజుల పర్యటన
- పారిశ్రామిక వేత్తలతో రోడ్ షో, తెలుగు డయాస్పొరాకు హాజరు
- విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న సీఎం
- యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీలు
అమరావతి/దుబాయ్ (చైతన్య రథం): విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం యూఏఈకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు విమానాశ్రయంలో స్థానిక తెలుగు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అబుదాబి ఇండియన్ ఎంబసీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్‌నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్‌కుమార్ శివన్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిరోజు భేటీ కానున్నారు. నేటినుంచి యూఏఈలో చంద్రబాబు బృందం మూడు రోజులపాటు పర్యటించనుంది. తొలుత యూఏఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం.. అక్కడినుంచి 10 గంటలకు యూఏఈకు బయలుదేరారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానించడానికి స్వయంగా ముఖ్యమంత్రే వెళ్లడం గమనార్హం. యూఏఈలో మూడురోజులు పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అలాగే ఓ సైట్‌ను విజిట్ చేస్తారు. సైట్ విజిట్లో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. తొలిరోజు బుధవారం ఐదు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. నవంబరు 14, 15 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానిస్తారు. అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్‌లో ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తొలిరోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. వీరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు.













