- కేంద్రం నుంచి సకాలంలో నిధులు సాధిస్తాం
- గృహ నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూస్తాం
- కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండోరోజు గురువారం సచి వాలయంలో కలెక్టర్ల సమావేశంలో గృహనిర్మాణ శాఖపై సమీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాబట్టి గృహ నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూస్తామని వివరించారు.
నెలాఖరు నాటికి లక్ష ఇళ్ల నిర్మాణం
గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇళ్లు పూర్తిచేసి లబ్ధి దారులకు ఇంటి తాళం చెవులు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతులమీదుగా చేపట్టాలని నిర్ణయించాం. లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన, చేసిన పనులకు బిల్లుల పెండిరగ్ వంటి అంశాలను కేంద్రగృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే బడ్జెట్‌లో తప్పక కేటాయిస్తామని చెప్పారని వివరించారు.
ఆగస్టు నాటికి 84,068 ఇళ్ల నిర్మాణం పూర్తి
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (హౌసింగ్) అజయ్‌జైన్ తన శాఖలో పురోగతిపై వివరించారు. 2024 ఆగస్టు నాటికి 84,068 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. సెప్టెంబర్ 28న మన ఇళ్లు – మన గౌరవం పేరుతో ప్రత్యేక కార్యక్రమం, అక్టోబర్ 21, 22 తేదీల్లో గుంటూరులో పీఎంఏవై గ్రామీణ్ 2.0 రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పీఎంఏవై అర్బన్ 2.0 పథకం అమలుకు శ్రీకారం చుట్టామని, డిసెంబర్ 2024 చివరి నాటికి లక్ష మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇంటి తాళం అందజేయడం జరుగుతుందని వివరించారు. హౌసింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం నాణ్యత పరీక్ష కోసం డ్రోన్‌ల వినూత్న వినియోగంపై విశాఖపట్నం, వైఎస్‌ఆర్ కడపలో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మార్చి 2026 నాటికి 7.95 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ ఇసుక పాలసీకి స్వస్తి పలికి కొత్త ఇసుక పాలసీని అనుసరిస్తున్నాం. ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందజేస్తున్నట్లు వివరించారు. గృహ నిర్మాణంపై జిల్లాలవారీగా, మండలాలవారీగా, క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కొన్ని జిల్లాల్లో అప్రోచ్, ఇంటర్నల్ రోడ్స్ డ్యామేజీ సమస్యగా మారిందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సబ్ ప్లాన్ కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనపు సహాయం అందిస్తున్నామని వివరించారు. డిసెంబర్ 2024 నుంచి మే 2025 వరకు పీక్ వర్కింగ్ సీజన్‌గా భావించి జిల్లా కలెక్టర్లు వారానికోసారి సమీక్షలు, క్షేత్ర సందర్శన కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని సూచించారు.