అమరావతి (చైతన్య రథం): ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయం నుంచి నేరుగా సమీపంలోని ఎయిర్ ఫోర్స్ ఆడిటోరియానికి వెళ్లారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారులు కార్తికేయ, కునాల్‌ల వివాహా రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు.. రెండు జంటలను ఆశీర్వదించారు. అక్కడినుంచి అధికార నివాసం వన్ జన్‌పద్‌కు వెళ్లిన చంద్రబాబు.. టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు నాయుడు చర్చించినట్టు సమాచారం. బుధవారం కూడా ఢిల్లీలోనే చంద్రబాబు పర్యటిస్తున్నారు. బుధవారం గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌తో చంద్రబాబు కీలకంగా భేటీ కానున్నారు. వివిధ రంగాల్లో ఏపీకి సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందాలను సీఎం చంద్రబాబు కుదర్చుకోనున్నారు. అలాగే, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పున:ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు ఇతర అంశాలపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కలవనున్నారు.
తానా సమావేశాలకు చంద్రబాబుకు ఆహ్వానం
తానా సమావేశాలకు ఏపీ సీఎం చంద్రబాబును తానా బృందం ఆహ్వానించింది. మంగళవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్‌లో కలిసిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి ఆహ్వానాన్ని అందచేసింది. సీఎంను కలిసిన వారిలో తానా సమావేశాల చైర్మన్ నాదెండ్ల గంగాధర్, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులున్నారు. జూలై 3నుంచి 5వరకు తానా సమావేశాలు జరుగనున్నాయి.