- కేంద్రం సత్వర స్పందన
- ఎంఐఎస్ పరిమితి పెంపునకు అంగీకారం
- 25 శాతం నుండి 75 శాతానికి పెంపు
- ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధరల్లో వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు గ్రీన్ సిగ్నల్
- ఎగుమతులు పెంచేందుకు చర్యలు
- అధికారులతో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్ సుదీర్ఘ సమావేశం
- పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగిపోవడంతో రాష్ట్రంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర అంశం కేవలం ఒక్క రోజులోనే పరిష్కారమయింది. నష్టాల బాటలో కొనసాగుతున్న మిర్చిరైతుకు భారీ ఊరట లభించింది. రైతులకు గిట్టుబాటు ధర లభించే దిశగా ఒకటి, రెండు రోజుల్లో చర్యలు కూడా మొదలు కానున్నాయి. ఈ మేరకు కేంద్రం చూపించిన సత్వర స్పందనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్)లో 25 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించింది. 75 శాతం మేర పంట కొనుగోలుకు అంగీకరించింది. మిర్చి ఉత్పత్తి వ్యయం.. మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ ధర-ఉత్పత్తి వ్యయం మధ్య తేడా కేంద్రం భరించనుంది. ఈ ఏడాది మిర్చి ఎగుమతులు తగ్గినందున, వాటిని పెంచేందుకు ఎగుమతిదారులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది.
ముందే దృష్టి సారించిన సీఎం చంద్రబాబు
మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదంటూ ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళిని తోసిరాజని మరీ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి కొన్ని వారాల ముందు నుంచే ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. మిర్చి ధరలపై మూడు సార్లు కేంద్రానికి స్వయంగా లేఖలు రాసారు. ఎప్పటికప్పుడు ఏపీకి చెందిన కేంద్ర మంత్రుల్ని, ఎంపీలని కేంద్రం దగ్గరకు పంపించారు. బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మిర్చి ధరల గురించి ప్రస్తావించి కేంద్రం ఆదుకోవాలని కోరారు. అయినప్పటికీ సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో సీఎం చంద్రబాబు తానే రంగంలోకి దిగిపోయారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసిన చంద్రబాబు..
ఆ మరునాడే ఢల్లీి సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై.. నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కార్యాలయానికి వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు వెళ్లిన సమయంలో మధ్యప్రదేశ్‌లో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ తన కార్యాలయంలో అందుబాటులో లేరు. అయితే సీఎం చంద్రబాబు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న ఆయన మంత్రిత్వ శాఖ అధికారులను అప్రమత్తం చేసి చంద్రబాబుతో భేటీ కావాలని ఆదేశాలు జారీ చేశారు. తాను ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నా వర్చువల్‌గా చౌహాన్ కూడా ఈ భేటీలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మిర్చి రైతుల పరిస్థితిని సమగ్రంగా వివరించిన చంద్రబాబు.. కేంద్రం ఆదుకోక తప్పదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కేంద్రానికి ఉన్న పరిమితులను కూడా చంద్రబాబే గుర్తు చేసి.. వాటిని ఎలా అధిగమించాలన్న దిశగా పలు సలహాలు, సూచనలు చేశారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందు సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు ఉంచారు. మార్కెట్ జోక్యం పథకం కింద 25 శాతం పంట కొనుగోలు సీలింగ్ తొలగించి సాధ్యమైనంత ఎక్కువ పంట కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఐసీఏఆర్ నిర్ణయించిన మిర్చి ధరలు ఏపీ రైతుల సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఖరారు చేసినట్లు కనిపిస్తోందని… వాటిని సరిదిద్దాలన్నారు. మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు ఎలా పంచుకోవాలో ఆలోచన చేయాలన్నారు. మిర్చి ఎగుమతులను స్థిరీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
తక్షణ స్పందన
సీఎం చంద్రబాబు ఆవేదనను, సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రమంత్రి రాత్రికి రాత్రే సమస్య పరిష్కారంపై అధికారులతో చర్చించారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయాన్నే ఏపీకి చెందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని పిలిపించి, ఆయన సమక్షంలోనే కేంద్ర వ్యవసాయ, మార్కెంటింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కేంద్రం 25 శాతం పంట ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసే పరిమితిని ఏకంగా 75 శాతానికి పెంచారు. అంతేకాకుండా ఈ మేర కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ అధికారులతో వర్చువల్‌గా మాట్లాడిన చౌహాన్.. కేంద్రం నిర్ణయాలను తెలియజేసి.. ఆ మేరకు చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రం చర్యలు ప్రారంభించింది: రామ్మోహన్ నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తితో ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఢల్లీిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం అనంతరం మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి చౌహాన్‌ను కోరామని తెలిపారు. మిర్చికి రూ.11,600 కంటే ఎక్కువగానే మద్దతు ధర ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. మిర్చి ఎగుమతులు, ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే అంశంపై భేటీలో చర్చించాం. సమస్య చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి చౌహాన్ స్పందించారు. ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కెట్ ధర, ఉత్పత్తి ఖర్చుకు మధ్య తేడా పరిశీలిస్తామన్నారు. రాయలసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల మిర్చి రైతులకు లబ్ధి కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 7నే ఈ సమస్యను తెరపైకి తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో.. మిర్చి సేకరణ, ఎగుమతులను పెంచడానికి, మన రైతులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే మార్గాలపై చర్చించాం.
మన మిర్చి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి, కీలక సవాళ్లను అర్థం చేసుకుని పరిష్కరించడానికి ఐసీఏఆర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంపైనా సమావేశంలో చర్చించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్కిస్తే రూ.11,600 వచ్చిందని.. అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిరచారు. మిర్చి ఎగుమతులు పెంచడం గురించి కూడా సమావేశంలో చర్చించామన్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సదస్సు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సదస్సు ద్వారా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి పెడతామన్నారు. మిర్చి రైతుల ఆదాయం ఎలా పెంచాలన్న విషయంపైనే అందరం ఆలోచిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారన్నారు.
రైతుల కష్టం తెలిసిన వ్యక్తి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అని.. గురువారం ఢల్లీిలో లేనప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారని తెలిపారు. శుక్రవారం ఢల్లీి వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నామన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని రూ. 11,600 కంటే ఎక్కువగా నిర్ణయించాలని ఐసీఏఆర్‌ను కోరినట్లు చెప్పారు. మిర్చి పంట సేకరణను అత్యవసరంగా చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్స్ స్కీం కొనుగోలు పరిమితిని ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 75 శాతం వరకు పొడిగిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఏపీలో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాల్‌కు 11600 లేదా ఉత్పత్తి వ్యయం జోడిరచి రూ.12,000 పైచిలుకు ధరను అందించాలని అడిగామన్నారు. మిర్చి రైతుల విషయంలో వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.