- శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడతాం
- గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు
- గత పాలకులు స్వార్థ ప్రయోజనాలకు తిరుమలను అపవిత్రం చేశారు
- ప్రజలకు మంచి చేసే శక్తిని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నా
- రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది… ప్రజలంతా భాగస్వామ్యం వహించాలి
తిరుమల/తిరుపతి: రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమయిందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని…తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని ప్రకటించారు. గత పాలకుల హయాంలో తిరుమల కొండపైకి గంజాయితో పాటు మాంసాహారం, మద్యం తీసుకొచ్చి పవిత్రమైన దేవస్థానాన్ని అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుచానారు అమ్మవారిని కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకుముందు కొండపైన మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారన్నారు. పోటీ చేసిన స్థానాల్లో విజయాలకు సంబంధించి 93 శాతం స్ట్రైక్ రేట్ దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే వచ్చింది. నేను ఏ సంకల్పం తీసుకన్నా వెంకటేశ్వరస్వామిని తలుచుకుని ముందుకు వెళ్తా. చిన్నతనంలో కూడా దేవుడికి మొక్కులు తీర్చుకోవడానికి నడిచివచ్చేవాళ్లం. ఆయన ఆశీస్సులతో అంచలంచలుగా ఎదగి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో పాటు, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాను.
2003లో వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుంటే క్లైమోర్ మైన్స్ పేలాయి…అప్పుడు ఆ ఏడుకొండలస్వామే నన్ను బతికించారు. నా వల్ల ఈ రాష్ట్రానికి..తెలుగుజాతికి ఇంకా మంచి చేయాలన్న ఆశీస్సులతో ప్రాణభిక్ష పెట్టారు. దివంగత ఎన్టీఆర్ మెదటగా తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అది అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద నిధి సమకూరింది. నా మనవడు దేవాన్ష్ ప్రతి పుట్టినరోజు నాడు అన్నదానానికి విరాళం అందిస్తున్నా. నేను ఎక్కువగా పూజలు చేయకపోయినా పవిత్రమైన మనసుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడ్ని కోరుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి
ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి..అందులో తెలుగుజాతి ముందుండాలి, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో..సృష్టించిన సంపద పేదవారికి అందడం అంతే ముఖ్యం. సంపద కొంతమందికే పరిమితం కాకుండా పేదరికం లేని సమాజంగా మారాలి. పేదరికం లేని సమాజం ఏర్పడితేనేత మెరుగైన జీవన ప్రమాణాలతో ప్రజలు ముందుకెళ్తారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించాలి..ఇది ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలతోనే సాధ్యం అవుతుంది. 1995లో నా పాలన ప్రారంభమైంది. అంత వరకు సచివాలయానికే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్మకు వచ్చింది. ఆ రోజు చేసిన అభివృద్ధితో వచ్చిన ఫలాలు చూసి ప్రపంచాధినేతలంతా హైదరాబాద్ రావడానికి ప్రయత్నించారు.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి. జరిగిన మంచిని ప్రపంచమంతా గుర్తిచ్చింది…ఆ గుర్తింపునే మేము తీసుకొచ్చాం. దేశానికి అతిపెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో ఎనర్జీ రీఛార్జ్ తో పాటు, భద్రత, ఆనందం, బాధలను పంచుకునే భాగస్వాములు ఉంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు అండగా నా కుటుంబం నిలబడిరది. జైల్లో కలవడానికి కుటుంబ సభ్యులకు వారానికి రెండు సార్లు మాత్రమే అనుమతించారు. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు…మా ఇంటి ఇలవేల్పు. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక్కపొద్దుతో నిష్టగా పూజలు చేసిన తర్వాతే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్లం…ఈ సంస్కృతి చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది. కలియుగం దైవం వెంకటేశ్వరస్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ రావాలని కోరుకుంటారు. ప్రపంచంలో మనదేశం ముందుండాలి…అందులో తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు అన్నారు.
శక్తినివ్వాలని కోరుకున్నా
పేదరికం లేని సమాజాన్ని స్థాపించేందుకు తగిన శక్తిసామర్థ్యాలను ఇవ్వాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నా. సంపద లేనప్పుడు…దానిని సృష్టించడం కోసం రెండవ తరం ఆర్థిక సంస్కరణలు నేను తీసుకొచ్చాను. ఆ సంస్కరణలతో బ్రహ్మండమైన రోడ్లు వచ్చాయి. నాటి ప్రధాని వాజ్ పేయ్ హయాంలో దేశమంతా పెద్దస్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. కంప్యూటర్లు అన్నం పెడుతాయా అన్నారు…కానీ ఇప్పుడు నిత్యావసర వస్తువులా మారాయి. వర్చువల్ వర్క్‌కు కూడా పనికొస్తోంది. సెల్‌ఫోన్ల విషయంలోనూ మొదట అందరూ పెదవి విరిచారు. నేడు అదే అరచేతిలో ఆయుధంగా మారిందని చంద్రబాబు అన్నారు.
నేను అందరి వాడిని
ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పరదాలు కట్టడం అధికారులకు అలవాటైంది. జనాలు కలవకుండా కర్ఫ్యూ పెట్టేవారు. ఇలాంటి సంస్కృతి చూస్తే బాధేస్తోంది. పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు…కానీ తప్పు చేసిన వారికి శిక్ష వేయకపోతే దేవుడు కూడా సహకరించరు. మంచివారిని కాపాడుకోవాలి…చెడు వ్యక్తులను శిక్షించి సమాజాన్ని కాపాడాలి. నా జీవితంలో నా కుటుంబానికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 35 ఏళ్ల క్రితమే చిన్న వ్యాపారం ఏర్పాటు చేసి నా కుటుంబం రాజకీయాలపై ఆధారపడకుండా చేశాను. నా జీవితంలో కుటుంబానికి ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కుటుంబానికి సమయం ఇస్తా. ఆదరించిన ప్రజలకు రుణపడి ఉంటా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలను విపరీతంగా భయపెట్టారు. అయినా జనం వెనక్కి తగ్గకుండా మాకు భారీ విజయం అందించారు. నాకు ప్రజలపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి..ప్రజలు గెలిచారు…రాష్ట్రాన్ని నిలబెట్టారు…ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు…అందరి వాడిని. ఐదుకోట్ల ప్రజలకు చెందిన వ్యక్తినని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఐదేళ్ల విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి
కొందరు మీడియా ప్రతినిధులు కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడి కోర్టుల చుట్టూ తిరిగారు. వాస్తవాలు చెప్పలేని దుస్థితి అనుభవించారు. నాయకులు, కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. శనివారం వస్తే ఎప్పుడు ఎవరి ఇంటిపైకి పొక్లెయిన్ వస్తుందో…41ఏ నోటీసులిస్తారో అని భయపడే పరిస్థితి కల్పించారు. ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు చెట్లు నరకడం, పరదాలు కట్టడం, పొక్లెయిన్లు పంపడాలు ఉండవు. రాష్ట్రంలో ఇక ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని నాపై నమ్మకం పెట్టుకున్నారు…ఆ నమ్మకాన్ని నేను నిరూపించుకోవాలి. ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది.
తిరిగి పునర్నిర్మించుకోవాలి. పాలనలో రాగద్వేషాలకు తావు లేదు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభుత్వంలో భాగం కావాలి. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్-1 గా ఉంటుంది. ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కచ్చితంగా ఉంటారు…అందులో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. టెక్నాలజీ, ఐటీని అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చాం. రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల సేవలు ప్రపంచానికి అవసరం ఉంటుంది. 2047 నాటికి నాటికి తెలుగుజాతి నెంబర్-1గా ఉంటుందని చంద్రబాబు ఆకాంక్షించారు.
తెలుగు జాతికి పెద్దగా ఉంటా…
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాల్సి ఉంది. ఆంధ్రపదేశ్‌తో పాటు తెలంగాణ కూడా బాగుండాలి. తెలుగుజాతికి నేను పెద్దగా ఉంటా. విభజన జరిగినప్పుడు హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది…కష్టపడి ఏపీకి మంచి నగరం నిర్మించి అభివృద్ధి చేసి రుణం తీర్చుకోవాలనుకున్నా. అందుకే అమరావతి, పోలవరం ప్రారంభిస్తే అవి రెండూ గత ప్రభుత్వంలో పడకేశాయి, అమరావతి విధ్వంసం పాలైంది…ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే జీవనాడి పోలవరాన్ని గోదావరిలో కలిపారు. వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. నేను అనుకున్న సంకల్పంతో ముందుకు వెళ్లేలా దేవుడు ఆశీర్వదించాలి. తిరుమల పవిత్రమైన దివ్యక్షేత్రం…ఈ దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. ప్రసాదాల్లో నాణ్యత లేకుండా, శుభ్రం లేకుండా దిగజార్చారు. ఓం నమో వెంకటేశాయా…గోవింద నామస్మరణ తప్ప మరో మరో నినాదం కొండపై ఉండకూడదు. మొత్తం ప్రక్షాళన చేసి ప్రపంచమంతా అభినందించేలా టీటీడీని తీర్చిదిద్దుతాం. దొంగలే.. దొంగ దొంగ అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. అలాంటి వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గతంలో నా పాలనలో సంఘవిద్రోహ శక్తులు, రౌడీలు లేకుండా చేశాను. రాజకీయం ముసుగులో నేరస్తులు ఉండకూడదు. నేరాలు చేసినా తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
శ్రీవారి సేవలో చంద్రబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు. బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూక్లాంపెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో చంద్రబాబు
సీఎం చంద్రబాబు గురువారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. చంద్రబాబు, నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలకు ఆలయ అధికారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. అధికారులు చంద్రబాబు కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి, శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు నారా లోకేష్‌తో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
దీనిపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. కుటుంబంతో కలిసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నామని పేర్కొన్నారు. ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. తమ పర్యటనకు సంబంధించిన ఫొటోలను కూడా లోకేష్ పంచుకున్నారు.