- అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి
- గ్రామాల్లో అభివృద్ధితో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత
- భూ రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
- అధికారులతో సమీక్షలో మంత్రి డోలా
కొండపి (చైతన్యరథం): స్వర్ణాంధ్ర విజన్ `2047, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ రెవిన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, వెలుగు, డ్వామా, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా, జీరో పేదరికం, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకొని వాటికి అనుగుణంగా పనిచేయాలి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కరెంట్ పోల్స్ తప్పని సరిగా ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి డోలా ఆదేశించారు.
పకడ్బందీగా రీ సర్వే
అనంతరం రెవిన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…..భూ రీ సర్వేను అత్యంత పగడ్బందీగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అక్రమాలు గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. పరిశ్రమలకు భూములు కేటాయించే అంశంలో రైతులు, కలెక్టర్‌తో సంప్రదించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేటాయింపులు జరపాలని సూచించారు. గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందజేయాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.