అమరావతి, చైతన్యరథం: ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అభ్యంతరం తెలిపారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. డోర్ టు డోర్ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని ఆ లేఖలో కనకమేడల పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన టీడీపీ వారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అభ్యంతరాలు తెలిపారని, తప్పుడు భాషతో దూషించారని తెలిపారు. ప్రతి రోజూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రచారంకోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని…కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఎన్నడూ ఇవ్వలేదన్న విషయాన్ని కనకమేడల గుర్తు చేశారు.