- ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సే సాక్షీభూతం
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉద్ఘాటన
అమరావతి (చైతన్య రథం): గత ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేయడమే కాదు, దాని వెనుక సొంత కాళ్లపై నిలబడాలన్న ఒక బలమైన వ్యవస్థనూ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడ రూరల్ జక్కంపూడిలో 2018లో నిర్మాణం చేపట్టిన ‘‘ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్’’ను మంత్రి పరిశీలించి, నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జరిగిన విధ్వంసాన్ని చూసిన చలించిపోయిన మంత్రి కొండపల్లి మాట్లాడుతూ నిరుపేదలు, దిగువ మధ్యతరగతి భవిష్యత్తుకు బలమైన పునాదులను గత వైకాపా ప్రభుత్వం ఏవిధంగా కూల్చిందన్నది ప్రజలకు స్వయంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కాంప్లెక్స్ ద్వారా టిడ్కో ఇళ్ళలో నివాసం ఉండే ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. కొద్దికాలంలో ఒక భారీ ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేశారు. అన్ని సదుపాయాలను కేవలం 3 నెలల్లో కల్పించి, మరో 4 నెలల్లో అందుబాటులోకి తీసుకురావచ్చని ఆయన తెలిపారు.
ఆ సమయంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి రాష్ట్రంలో వైకాపా పాలన ప్రారంభమైంది. చిన్న మధ్య తరహా కంపెనీలకు బలమైన వేదిక కావాల్సిన కాంప్లెక్స్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. టిడ్కో ఇళ్ళలో నివాసం ఉండేవారికి ఉపాధి కల్పించే కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం పాతరేసిందని మంత్రి కొండపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా సాగుతున్న నేటి ప్రభుత్వం.. నైపుణ్యం పెంపునకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. టిడ్కో ఇళ్ళలో నివాసం ఉండే పేదలు, వారసులు ఉద్యోగ, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా కాంప్లెక్స్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు ప్రాణం పోసి, టిడ్కో ఇళ్ళు అనేవి కేవలం నివాస సముదాయాలే కాదు, భవిష్యత్తుకు భరోసా కల్పించే సౌధాలుగా మార్చుతామన్నారు. జగన్ హయాంలో సాగిన విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన జక్కంపూడి ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను ఉత్పత్తి, ఉపాధి కేంద్రంగా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ వెల్లడిరచారు.