- పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం దూకుడు
- 25 శాతానికి పైగా సాధించి దేశంలోనే అగ్రస్థానం
- ఆర్ధిక సంవత్సరం తొమ్మిది నెలల నివేదిక విడుదల
- 25.3 శాతం పెట్టుబడులతో టాప్ లో ఏపీ
- రెండు, మూడు స్థానాల్లో ໖ (13.1 ), మహారాష్ట్ర (12.8 శాతం)
- ఆంధ్రప్రదేశ్ దూసుకెళుతోందని మంత్రి లోకేష్ హర్షం
- దేశాభివృద్ధికి రథసారథిగా రాష్ట్రం నిలిచిందని ఉద్ఘాటన
- సీఎం చంద్రబాబు వేగం, విధానాలే కారణమని స్పష్టం
అమరావతి (చైతన్యరథం): దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళుతోంది. ఈ రంగంలో ఏపీ అత్యంత దూకుడు చూపిస్తోందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదికలో పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్గా నిలిచింది. ఈ నివేదికను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకువెళుతోంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. 13.1 శాతంతో ఒడిశా, 12, 8శాతంతో మహరాష్ట్ర రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దేశం మొత్తం పెట్టుబడుల్లో 51.2 శాతం ఈ మూడు రాష్ట్రాలు సాధించాయి. దేశవ్యాప్తంగా పెట్టుబడి ప్రకటనలు 26.6 లక్షల కోట్లని నివేదికలో పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 11.5 శాతం వృద్ధి కనిపించింది. వేగవంతమైన నిర్ణయాలు, స్థిరమైన విధానాలే ఏపీ విజయానికి కారణమని మంత్రి లోకేష్ తెలిపారు. పోర్ట్లు, ఇండ్రస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్, ఎనర్జీ, డిజిటల్ మౌలిక వసతులపై ఏపీ దృష్టి సారించిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చూపుతున్న చొరవ, వేగం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదిక ప్రకారం, దేశం మొత్తమ్మీద ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో దేశంలో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇది దేశ పారిశ్రామిక, పెట్టుబడుల ప్రస్థానం తూర్పు, దక్షిణ కారిడార్ల వైపు మళ్లుతున్న నిర్ణయాత్మక మార్పును సూచిస్తుంది.. పెట్టుబడుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. ఒడిశా, మహారాష్ట్రను దాటి పారిశ్రామిక వృద్ధి సాధించాం. వేగం, స్థిరమైన నిర్ణయాలే ఏపీ విజయాలకు కారణం. పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, ఎనర్జీ, డిజిటల్ రంగాల్లో మౌలిక వసతులపై ఏపీ దృష్టి సారించింది.
మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెటర్లు, మొబిలిటీ రంగాల్లో ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోనే పెట్టుబడులకు ఏపీ కేంద్ర బిందువుగా మంత్రి లోకేష్ అభివర్ణించారు. కనెక్టివిటీ, ఫ్రెండ్లీ పాలసీలు కలిగి ఉండటంతోనే ఏపీ తొలి ఎంపికగా మారిందని వెల్లడించారు. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ రథసారథిగా నిలిచిందని పేర్కొన్నారు. జాతీయ పెట్టుబడులలో రాష్ట్ర వాటా పెరుగుతున్నది. స్థిరమైన సంస్కరణలు, నిర్ణయాల్లో వేగం, పెట్టుబడిదారుల పట్ల స్పష్టమైన నిబద్ధతకు ఫలితమే ఈ విజయం. మా విధానాలు స్పష్టంగా ఉన్నాయి. పెట్టుబడిదారులతో దీర్ఘకాలిక, సుస్థిర భాగస్వామ్యాలను కొనసాగించటం. అత్యంత వేగంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణకు వీలైన వాతావరణాన్ని సృష్టించడం, ఉద్యోగ సృష్టికి ప్రాధాన్యత ఇవ్వటం. పెట్టుబడుల ప్రకటనను వీలైనంత త్వరగా ఆన్-గ్రౌండ్ ప్రాజెక్టులుగా మారేలా చూడటం తమ విధానమని స్పష్టం చేశారు. ప్రతి పెట్టుబడి ప్రకటన.. పరిశ్రమగా, ఉద్యోగాలుగా, మన ప్రజలకు ఆర్థిక అవకాశాలుగా మారాలనేదే తమ ధ్యేయమన్నారు.














