- పోలవరం జాప్యానికి జగనే కారకుడు
- నీటిపారుదల రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద పీట
- జగన్ మూసేసిన ఎత్తిపోతల పథకాలన్నీ పునరుద్ధరిస్తాం
- అసెంబ్లీలో మంత్రి రామానాయుడు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనలో మొత్తం 1047 ఎత్తిపోతల పథకాల్లో 450 పథకాలు వరకు మూతపడ్డాయని, వీటిని పునరుద్ధరిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నదుల అనుసంధానం సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఇందుకు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను గత వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలనతో పడుకోబెట్టిందన్నారు. మంగళవారం శాసనసభలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానం ఇస్తూ నీటిపారుదల రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి, డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి జగనే కారకుడని ధ్వజమెత్తారు. అసమర్థత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్ పోలవరం పై సమాధానం చెప్పలేకే అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకొని 72 శాతం పనులు పూర్తి చేశారన్నారు.
గత ఐదేళ్లలో జగన్ ఈ ప్రాజెక్టును 20 -30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారన్నారు. ప్రధానంగా 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే జగన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతోనే పాజెక్ట్‌లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. పైగా 2021, 2022 నాటికి పూర్తి చేస్తామని చెప్పడం జగన్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. పోలవరం ప్రాజెక్టు పట్ల గాని, రైతుల పట్ల గాని జగన్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారంటే ఆ ప్రాజెక్ట్‌కు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించటంతోపాటు నదుల అనుసంధానం చంద్రబాబు లక్ష్యమని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందిస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
ఐదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం
జగన్ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురైందన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులు, బ్యారేజీలు, జలాశయాలు, కాలువలు, డ్రైన్ల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మరమ్మతులు మాట ఎలా ఉన్నా కనీసం గ్రీజు పెట్టే పరిస్థితి కూడా లేదన్నారు. ఇరిగేషన్ వ్యవస్థలో కీలకమైన లస్కర్లు 7224 మంది అవసరం కాగా 1515 మంది మాత్రమే ఉన్నారని, వారికీ ఏడాది కాలంగా జీతాలు ఎగ్గొట్టిందని మంత్రి రామానాయుడు దుయ్యబట్టారు. ఆయకట్టు ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి రూ.983 కోట్లు కేటాయించాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం ఐదేళ్లకు కలిపి కేవలం రూ. 127 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. 2014 -19 మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో రూ.7 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే రూ. 72 వేల కోట్లు ఇరిగేషన్‌కు కేటాయించామన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో బడ్జెట్ రూ.12 లక్షల కోట్లు ఉంటే ఇరిగేషన్‌కు కేవలం రూ.38 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఇరిగేషన్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తొలిగా కాలువలు, డ్రైన్లలో గుర్రపు డెక్క, తూడు, పూడిక తొలగింపు వంటి అత్యవసర పనులకు రూ. 284 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన అడివిపల్లి రిజర్వాయర్ పనులు నిలిచిపోయిన పాపం జగన్‌దే అన్నారు. ఈ పనులను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అడవిపల్లి రిజర్వాయర్ పనులకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో 2019 లోనే వంద శాతం పూర్తయ్యాయని, గత వైసీపీ ప్రభుత్వంలో మెయిన్ కెనాల్, నీటి సరఫరా నిర్వహణకు సంబంధించి కొంచెం కూడా పనులు జరగలేదన్నారు.
ఈ పనులు ముందుకెళ్లేలా మూడు దశల్లో మొత్తంగా కలిపి రూ. 350 కోట్లు అవసరమని ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారని, త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. గత ఐదు నెలల్లోనే వారానికి రెండు సార్లు సమీక్షలు చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులను గాడిలో పెట్టి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు సామర్థ్యం 961 టీఎంసీలు కాగా ప్రస్తుతం 844 టీఎంసీల సామర్థ్యంతో 87 శాతం పైబడి నీటి నిల్వలతో నింపినట్లు మంత్రి రామానాయుడు వెల్లడిరచారు.
సీమకు జగన్ తీరని ద్రోహం: కాలవ
నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పోలవరం విధ్వంసం సహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వీర్యంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం, చిత్తూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు 512 టీఎంసీలను ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా సీఎం చంద్రబాబు కృషి చేశారని ఆయన చెప్పారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాయలసీమ అత్యంత నీటి దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చెప్పారు.
నిర్వాసితులకు జగన్ అన్యాయం: బాలరాజు
పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకుంటే గత వైసీపీ ప్రభుత్వం వారికి తీరని అన్నాయం చేసిందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నిర్వాసితుడికీ న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస కార్యక్రమాలు పూర్తి చేసి నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు.
రివర్స్ పాలనలో నాశనం: బండారు
పోలవరాన్ని మొదట నాశనం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు, లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ పోలవరం అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నవయుగ కంపెనీ 72 శాతం పనులు పూర్తి చేయడంతోపాటు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిందని చెప్పారు. అయితే ప్రభుత్వం మారడంతో 10 నెలలపాటు రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చి ప్రాజెక్టును రివర్స్ చేశారని ధ్వజమెత్తారు. అటువంటి ప్రాజెక్టును తిరిగి చంద్రబాబు సీఎం అయ్యాక.. కేంద్రం నుంచి రూ.13వేల కోట్లు తెచ్చి మరలా జీవం పోసారన్నారు.
ప్రాజెక్ట్‌లను గాలికొదిలేశారు: ప్రత్తిపాటి
వైసీపీ హయాంలో గత ఐదేళ్లపాటు ఒక్క ఎకరాకు అదనపు నీరు ఇవ్వలేదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి ప్రాజెక్టులను గాలికొదిలేశారని మండిపడ్డారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిందని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.
ఆ పాపం జగన్‌దే: బుచ్చయ్య చౌదరి
పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్ భర్తీ చేయకపోవడం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి జగన్‌రెడ్డి అసమర్థ విధానాలే కారణమన్నారు. జగన్ నిర్వాకంతో రాష్ట్ర ప్రజలు నష్టపోయారన్నారు. రాష్ట్ర్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను ముంచేసిన పాపం జగన్‌దే అన్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రాజెక్ట్ నిర్మాణంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పోలవరానికి పొగపెట్టిన జగన్: ఆదినారాయణ రెడ్డి
పోలవరానికి జగన్ పొగపెట్టారని, అమరావతికి అగ్గిపెట్టారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. గండికోట ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకుండా ఆపేశారని ఆయన ఆగ్రహించారు. వైసీపీ అధినేత జగన్‌కు ఏ విషయంపైనా అవగాహన లేదని విమర్శించారు. పాలన తెలియని జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు గ్రహణం పట్టిందన్నారు.