- లెదర్ పార్కుల ఏర్పాటుకు గతంలోనే భూములు కేటాయింపు
- ఆ భూములపై గత ప్రభుత్వంలో వైసీపీ నేతల కన్ను
- రూ.కోట్ల విలువైన భూములు కొట్టేసేందుకు కుట్ర
- ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం
- చర్మకారుల కోసం ప్రత్యేక కో ఆపరేటీవ్ సొసైటీ ఏర్పాటు
- మీడియాతో లీడ్‌క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు
అమరావతి (చైతన్యరథం): చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గతంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు లెదర్ పార్కులకోసం భూములను కేటాయించారని, అయితే గత పాలకులు వాటిని అభివృద్ధి చేయకపోగా కోట్లు విలువ చేసే ఆ భూములను కొట్టేసేందుకు బినామీలతో కుట్ర పన్నారని లీడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాణిక్యరావు మాట్లాడుతూ చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి జిల్లాల్లో చర్మకారుల వృద్ధికోసం లెదర్ పార్క్‌ల ఏర్పాటుకు ఆయన భూములు కేటాయించారు. చంద్రబాబు నాయుడు కేటాయించిన భూములను జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి చేయకపోగా దోచుకునేందుకు యత్నించారు.
అడిగొప్పులలో 34.65 ఎకరాలను చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల క్రితం కేటాయిస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఆ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నారు. కోట్లరూపాయలు విలువ చేసే భూములను ఇళ్ల స్థలాల పేరుతో బినామీలకు కేటాయించారు. కాని ఒక్కరు కూడా అక్కడ ఇళ్లు నిర్మించుకోలేదు. ఆ భూమి మొత్తం అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర చేశారు. చర్మ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూమి ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకూడదని అధికారులకు స్పష్టంగా తెలియజేశాం. నిజమైన అర్హులు ఉంటే వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు తెలియజేశాం. విజయవాడలో రూ.100 కోట్ల విలువ చేసే భూమిని జగన్ రెడ్డి తాబేదారులు కొట్టేయాలని చూశారు. తప్పులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు మేము వెనుకాడం. చర్మకారుల అభివృద్ధికోసం నాడు చంద్రబాబు కేటాయిచిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లిడ్ క్యాప్ చైర్మన్‌గా నా మీద ఉంది. లెదర్ ఉత్పత్తుల మీద ఆదారపడే వారి జీవణ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మేము కృషి చేస్తున్నామని మాణిక్యరావు తెలిపారు.
చర్మకారులకు మెరుగైన శిక్షణ
ఏపీలో ఉన్న చర్మకారులందరి డేటా తీసుకుంటాం. వారికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు, అత్యాధునిక మిషనరీ ఇచ్చి వారి జీవితాలను మెరుగు పరచడానికి ప్రయత్నిస్తున్నాం. కామన్ ఫెసిలిటీ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి చర్మకారుల నైపుణ్యాన్ని పెంచి వారు వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇతర కో-ఆపరేటీవ్ సొసైటీల మాదిరిగా చర్మకారులకోసం ప్రత్యేక కో ఆపరేటీవ్ సొసైటీ ఏర్పాటు చేసి చర్మకారుల జీవన భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏపీలో చర్మ పారిశ్రామికాభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. చర్మ వృత్తిపై ఆధారపడిన యువతలో నైపుణ్యాన్ని పెంచేలా ముందుకు వెళ్తున్నాం. భారతదేశం నుండి లెదర్ ఎగుమతుల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. కోఆపరేటీవ్ సొసైటీల ద్వారా లెదర్ రంగంపై ఆధారపడిన వ్యక్తులకు సరైన ధరలు అందేందుకు కృషి చేస్తున్నాం. చర్మశుద్ధి కర్మగారాలన్నీ చెన్నైలో ఉన్నాయి. ఏపీలో చర్మ శుద్ధి కర్మాగార ఏర్పాటు, టానరీల ఏర్పాటు ఆవశ్యకతను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి ఏర్పాటుకు కృషి చేస్తాం. దీంతో చర్మరంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మాణిక్యరావు వివరించారు.