- దర్తి ఆబా పథకంతో స్వర్ణ ఆంధ్ర వైపు అడుగులు
- రూ.155 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- రైతుల కోసం మల్టీ పర్పస్ మార్కెటింగ్ కేంద్రాలు
- పోడు భూముల అభివృద్ధికి జమకానున్న నిధులు
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు నరహరి
అమరావతి(చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజనులను అభివృద్ధి వైపు నడిపించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజ నులను స్వర్ణ ఆంధ్ర వైపు నడిపిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు నరహరి వరప్రసాద్ పేర్కొన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు పంపుతూ వాటికి కేంద్రం నుంచి ఆమోదం పొందేలా చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి పాదనలకు కేంద్రం ‘దర్తి ఆబా జన్ జాతీయ్ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ కింద రూ.155 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వీటిలో 31 చోట్ల వసతిగృహ భవనాల నిర్మాణానికి రూ.75.39 కోట్లు, 39 చోట్ల తరగతి గదుల నిర్మాణానికి రూ.42.20 కోట్లు, 40 ప్రాంతాల్లో పాఠశాలలు, వసతిగృహాల్లో మరమ్మతులు, నవీకరణకు రూ. 13.13 కోట్లు, ఫర్నిచర్ కొనుగోలుకు 39 గిరిజన పాఠశాలలకు రూ.4.15 కోట్లు, 23 గురుకులాల్లో ఉపాధ్యాయ, సిబ్బంది వసతిగృహాల నిర్మాణానికి రూ.20.70 కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.40 లక్షలు విడుదలకు కేంద్రం మంజూరుచేయడం హర్షణీయమన్నారు.
అలాగే గిరిజన రైతులు దళారుల బారిన పడి నష్టపోకుండా పంట ఉత్పత్తులకు తగిన ధర దక్కేలా మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రతిపాదనకు కూడా కేంద్రం పచ్చజెండా ఊపినట్లు చెప్పారు. తొలిదశలో సీతం పేట, పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్పరం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో ఒక్కోచోట మొత్తంగా ఆరు కేంద్రాల ఏర్పాటుకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.6 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రైతుబజార్ల తరహాలో వీటిని ఏర్పాటు చేసి రోజువారీ విక్రయాలు పూర్తయిన తర్వాత మిగిలిన పంటను అక్కడే నిల్వ చేసుకునేలా గోదాము లను నిర్మించి డ్రైయింగ్ యార్డు, ప్రాసెసింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం గిరిజనుల అభివృద్ధిపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభు త్వం అందించిన ఆటవీ హక్కులు కలిగిన పోడు భూములను అభివృద్ధి చేసి సుస్థిర ఆదాయం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల పరిధిలో ఫారెస్ట్ రైట్ యాక్ట్ (ఎస్ ఆర్‌ఎ) సెల్స్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. వీటిలో ఇద్దరు చొప్పున, రాష్ట్రస్థాయి సెల్‌లో మరో ముగ్గురు సిబ్బందిని నియమించనుందని వివరించారు. వీటన్నింటికి 2024-25కి కేటాయించిన నిధులు 15 రోజుల్లో రాష్ట్ర ఖజానాకు జమకానున్నాయని చెప్పారు. నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని, ఆరేడు నెలల్లో వీటిని పూర్తి చేయాలని అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై హర్షం వ్యక్తం చేశారు.