- క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం
- తొక్కిసలాట ఘటనపై అత్యవసర సమీక్ష
- ఏర్పాట్లు, భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం
- డెత్ టోల్ పెరుగుతుండటంపై ఆందోళన
- మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు
తిరుపతి (చైతన్య రథం): తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని అంచనా వేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్న సీఎం చంద్రబాబు, విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారులమీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు… అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని సంబంధిత సిబ్బందిని నిలదీశారు. ఇలాంటిచోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలన్న సీఎం, నేటి ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నట్టు చెప్పారు.
గురువారం ఉదయం విజయవాడ ఎయిర్పోర్టునుంచి తిరుపతికి వెళ్తున్న సీపం చంద్రబాబు.. తొలుత రుయా, స్వివమ్స్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన అనంతరం తితిదే కార్యాలయంలో ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తిరిగి సాయంత్రానికి ఉండవిల్లి చేరుకోనున్నారు.