- ఆయన విజన్ సాధనకు అహర్నిశలు కృషిచేస్తున్నాం
- 18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు
- దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకే
- టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా?
- బ్రాండ్ సీబీఎన్ వల్లే ఏపీకి కంపెనీల రాక
- ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి
- యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్
జ్యూరిచ్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): అభివృద్ధి అంటే గుర్తుకువచ్చేది సీఎం చంద్రబాబునాయుడు.. ఆయన విజన్ సాధనకు తామంతా అహర్నిశలు కృషిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన మంత్రి లోకేష్.. జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్‌లో ఏపీఎనఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూరప్‌లో ఉన్న 20 దేశాల నుంచి తెలుగువారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సముద్రాలు దాటినా మనవారు సంప్రదాయాలు మర్చిపోలేదన్నారు. తెలుగుని, తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ఇందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జ్యూరిచ్‌లో తెలుగు వారి జోష్ అదిరిపోయింది. యూరోప్‌లో ఉన్న సుమారు 20 దేశాల నుంచి తెలుగువారు ఈ సమావేశానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను ఏ దేశం వెళ్లినా ముందు తెలుగు వారిని కలుస్తున్నాం. తెలుగు వారిని కలిసిన తరువాతే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నామని చెప్పారు.
18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు
ఈ సమావేశం ప్రజా ప్రభుత్వానికి అదృష్టం లాంటిది. ఏడాది క్రితం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గతేడాది ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీ ఇక్కడే ప్రారంభం అయ్యింది. మీతో సమావేశం అయిన తరువాతే మేము దావోస్ మీటింగ్ కి హాజరయ్యాం. అక్కడి నుంచి తిరుగులేదు. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏపీ. 18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులు.. తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. భారదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయి. పెట్టుబడుల్లో ఇప్పుడు ఏపీ నంబర్ 1. ఇందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఒక వ్యక్తి. మీసం తిప్పి తెలుగు వాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసింది ఒక వ్యక్తి. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీకి చూపించిన వ్యక్తి. ఆయన పేరు చెబితే ఢిల్లీ దద్దరిల్లింది. ఆ పేరే మూడక్షరాలు.. ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు కనుకనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చింది. గతంలో మనల్ని మదరాసీలు అనేవారు. ఆ చరిత్రను తిరగరాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.
చంద్రబాబుది అభివద్ధి అజెండా
ఎన్టీఆర్ ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో దానికి మరో చక్రం జోడించి డెవలప్‌మెంట్ అజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు క్వాంటం అని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆ బ్రాండ్ కూడా మూడు అక్షరాలే. ఆయనే మన సీబీఎన్. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతో నష్టపోయింది. అయినా ఇంత భరోసా మీకు ఎక్కడి నుంచి వస్తోందని చాలా మంది అడిగారు. వేరే రాష్ట్రాలకు లేనిది మనకు ఉన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఏపీలో పెడుతోంది. ఆర్సెల్లార్ మిట్టల్ లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టబోతోంది. టిసిఎస్, కాగ్నిజెంట్, సత్వా, ఏఎనఎసఆర్, రెన్యూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రోజు పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్ అని మంత్రి లోకేష్ అభివర్ణించారు.
చంద్రబాబుని చూసి బ్లైండ్‌గా ఫాలో కావాలి
కొంతమందిని మనం బ్లైండ్ గా ఫాలో కావాలి. ఎందుకో కూడా చెబుతాను. చంద్రబాబుకు విజన్ ఉంది. ఆయన ఇంజినీరింగ్ కాలేజీలు ప్రారంభించినా, హైటెక్ సిటీ కట్టినా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కట్టినా, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కట్టినా, అమరావతి కట్టినా, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నా అనేకమంది విమర్శలు చేస్తారు, చేస్తూనే ఉంటారు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అని ఎగతాళి చేశారు. అక్కడే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మించి చూపించారు చంద్రబాబు. ఏ దేశానికి వెళ్లినా తెలుగువారు ఉన్నారంటే కారణం చంద్రబాబు నాయుడు అని మంత్రి లోకేష్ చెప్పారు.
టీం 11 ముఖం చూసి ఎవరైనా పెట్టబడులు పెడతారా?
ఏపీలో టీం 11 ఉంది. అంటే అర్థమైందా రాజా? అదో ఏడుపుగొట్టు టీం. పెట్టుబడులు తీసుకువస్తామంటే ఏడుస్తారు. పెట్టుబడుల కోసం సింగపూర్‌కు వెళ్తే.. ఏపీకి రావద్దంటూ ఆ ఏడుపుగొట్టు టీం ఈ-మెయిల్స్ పెడతారు. మేం కొన్ని కంపెనీలను కలిస్తే ఏపీకి రావొద్దంటూ వారికి కూడా ఈ-మెయిల్స్ పెడుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడుని చూసి సదరు కంపెనీలు వస్తే మాత్రం క్రెడిట్ తీసుకోవాలనుకుంటారు. క్రెడిట్ చోరీ అంటారు. టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి వస్తారా? కోడికత్తికి వారికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. చెల్లినీ, తల్లినీ గెంటేసిన క్రెడిట్ ఇవ్వాలి. రూ.700 కోట్ల ప్రజాధనంతో విశాఖలో ప్యాలస్ కట్టుకున్న క్రెడిట్ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలని మంత్రి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబు విజన్ సాధనకు నిరంతర కషి
గతంలో కోడిగుడ్డు మంత్రిని దావోస్ ఎందుకు వెళ్లలేదంటే.. బాగా చలిగా ఉంటుందని, అందుకే వెళ్లలేదని చెప్పిన పరిస్థితి మనం చూశాం. ఎంత చలిగా ఉన్నా, వేడిగా ఉన్నా మీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడు. ఆయన నాయకత్వంలో యంగ్ టీం పనిచేస్తోంది. మా అందరికీ అదో అదృష్టం. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అన్నీ చూసిన వ్యక్తి. ఆయన రూపంలో ఒక అద్భుతమైన మెంటారింగ్ మాకు వస్తోంది. మేం అందరం మిస్సైళ్ల లాంటి వారం. మిసైల్స్‌కు జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరం. చంద్రబాబే మా అందరికీ జీపీఎస్. అందుకే ఆయన నాయకత్వంలో ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నాం. చంద్రబాబు విజన్ సాధనకు అహర్నిశలు కృషిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
బ్రాండ్ సీబీఎన్ వల్లే కంపెనీల రాక
దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కానీ కంపెనీలు ఏపీకే ఎందుకు వస్తున్నాయి? దానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది బ్రాండ్ సీబీఎన్. ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు. ఎన్నో పాలసీలు తీసుకువచ్చారు. రెండోవది స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్. ఒక జూమ్ కాల్, వాట్సాప్ మెసేజ్.. అహర్నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెద్దఎత్తన పెట్టుబడులు వస్తున్నాయి. మూడోది డబుల్ ఇంజన్ సర్కార్. దేశంలో ఎన్నో డబుల్ ఇంజన్ సర్కార్‌లు ఉన్నాయి. కేవలం ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఢిల్లీలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు, అన్న సమానులైన పవనన్న.. ముగ్గురు కలిసికట్టుగా ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా నష్టపోయాం. విభజన సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగిపోయిన అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్‌ను ప్రధాని మోదీ అందిస్తున్నారని మంత్రి లోకేష్ కతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం
అభివృద్ధి కొనసాగాలి అంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. ఒకే ప్రభుత్వం కొనసాగింది కాబట్టే గుజరాత్, ఒడిశా లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. మనం కూడా ఒక్క సారి ఆలోచించాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరం. ఇందుకు అందరం భాగస్వామ్యం కావాలి. ఇది మన ప్రభుత్వం. పది నిర్ణయాల్లో మూడు తప్పులు ఉంటాయి. వాటిని తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న వారిపై ఉంది. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. వింటాం, చర్చిస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి. లేదా మేం మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇక మార్పు అంటూ ఉండదు. ఈ ప్రభుత్వం పవనన్న చెప్పినట్లు కనీసం 15 ఏళ్లు ఉండాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి
ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నాం. సంక్రాంతికి మీ గ్రామాలకు వెళ్లి ఉంటే అక్కడ రోడ్లు చూసి ఉంటారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. కరెంట్ ఛార్జీలు తగ్గించాం. ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేశాం. 220 కేసులు వేసినా 150 రోజుల్లో పూర్తిచేశాం. 6వేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ
ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ మా అజెండా. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని మేం అహర్నిశలు పనిచేస్తున్నాం. కేబినెట్ లోనే పోటీ ఉందేమో అనిపిస్తోంది. నేను విశాఖ ఎకనామిక్ కారిడార్ అంటే.. టీజీ భరత్.. తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు. పెట్టుబడులకు మాలో మేమే పోటీపడుతున్నాం. చిత్తూరు- కడపను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారుస్తున్నాం. కర్నూలు- రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం- సీబీజీ ప్లాంట్స్, అమరావతి- క్వాంటమ్ టెక్నాలజీ, గోదావరి జిల్లాలు – ఆక్వా, ఉత్తరాంధ్ర – ఫార్మా, ఐటీ, మెడికల్ డివైసెస్. హారిజాంటల్, వర్టికల్ మోడల్ క్లస్టరైజేషన్ మోడల్‌లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
తెలుగువారంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లు
మనం ఎక్కడ ఉన్నా కలిసిమెలిసి ముందుకు వెళ్దాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగుజాతి గర్వపడే విధంగా మనం పనిచేద్దాం. మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వివిధ కంపెనీల్లో పనిచేసే వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి. ఒక వేళ మీరు పనిచేసే కంపెనీలకు విస్తరించే ఆలోచన ఉంటే వారికి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలని మంత్రి లోకేష్ కోరారు.
ఏపీ ప్రభుత్వం, ఏపీఎనఆర్టీ ఉండగా ఉంటాయి
మన సంస్కృతిని, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీఎనఆర్టీపై ఉంది. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీఎనఆర్టీ సిద్ధంగా ఉంది. ఓం క్యాప్ ద్వారా విదేశాల్లో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జర్మనీ, జపాన్, యూరోప్.. ఇలా అనేక దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరు మీ నెట్ వర్క్‌ను ఏర్పాటుచేసి ఆంధ్ర రాష్ట్రం గురించి వివరించండి. తెలుగుజాతి గర్వపడే విధంగా ఏపీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేద్దాం. ఏ ఆశయాలతో అయితే 94 శాతం స్థానాల్లో మమ్మల్ని గెలిపించారో.. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ బాధ్యతను నెరవేరుస్తామని మంత్రి లోకేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎనఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.













