- నూతన విధానాలు, ప్రమాణాలే ఆయనకు కొలమానాలు
- ఎక్స్‌లో ట్వీట్ చేసిన దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర
- అది తన బాధ్యతంటూ సీఎం చంద్రబాబు వినమ్ర సమాధానం
అమరావతి (చైతన్య రథం): సామాజిక మాధ్యమాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉండే దిగ్గజ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో అన్ స్టాపబుల్ అంటూ ట్వీట్ చేశారు. ఆయన్ను ఆపగలిగేవారు ఎవరూ లేరని కొనియాడారు. ఈ మనిషి తిరుగులేని శక్తి ..దశాబ్దాలుగా ఆయన అభివృద్ధి విధానాలకు ఆకర్షితుడిని అవుతున్నాను అంటూ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నూతన విధానాల్ని తీసుకురావటంతోపాటు తనతోపాటు తన చుట్టూ ఉన్నవారందరి ప్రమాణాలనూ ఎప్పుడూ పెంచుతూ ఉంటారని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. అభివృద్ధిపట్ల చంద్రబాబు తన ఆసక్తిని ఏమాత్రం సడలనివ్వకుండా నూతన విధానాలు, ప్రమాణాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో జరిగిన 30వ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులకు సులభతరమైన వాతావరణం కల్పించేందుకు ఎస్క్రో విధానం ప్రవేశపెడతామంటూ సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోను దీనికి జత చేశారు.
ఆనంద్ మహీంద్రా ప్రశంసలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రతిస్పందించారు. భారత్ అద్భుతమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని.. ఈ సమయంలో విధానాల రూపకర్తగా భారతీయుల్లోని పారిశ్రామిక వ్యవస్థాపక శక్తిని వెలికి తీయటమే తన బాధ్యతని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటు దిశగా కొత్త మార్గాలను, నూతన ప్రత్యామ్నాయాలను వారి ముందు ఉంచుతూ వాటిని అన్‌లాక్ చేయటమే కర్తవ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో తనవంతు పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా మహీంద్రా గ్రూప్ దేశానికి అందిస్తున్న సేవలు, భాగస్వామ్యం అమూల్యమైనవని .. ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నానంటూ ఎక్స్‌లో సీఎం స్పష్టం చేశారు. భారత పారిశ్రామికరంగంలో అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా చేసే పోస్టులు నిత్యం చర్చనీయాంశం అవుతాయి. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందనపై దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు.













