- మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం
- నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశం
- శాంతి, భద్రతలు తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టీకరణ
బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో సుచిరిత అనే యువతిని అత్యాచారం చేసి, చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. మరోపక్క సచివాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావును పిలిపించుకుని మాట్లాడి దోషులను గుర్తించి, అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు తెలిపారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు.
ఈపూరుపాలెం గ్రామానికి చెందిన సుచరిత అనే యువతిని శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బహిర్భూమికి వెళ్లిన కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి … వెతుక్కుంటూ వెళ్లగా రైల్వేట్రాక్ సమీపంలో ముళ్ల చెట్లలో మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తాం: అనిత
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈపురుపాలెం వెళ్లిన హోంమంత్రి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన చూస్తుంటే సభ్యసమాజంలో ఉన్నామా.. లేదా అని భయం వేస్తుందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించారని చెప్పారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారన్నారు. దోషులను గుర్తించి, అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున యువతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యువతి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.