విపత్తులను ఎదుర్కోవడంలో దేశవ్యాప్తంగా చంద్రబాబుని మించిన నాయకుడు లేరు. తుపానులరూపంలో సముద్రం చేసే విధ్వంసం కాచుకోవడం కొత్తకాదు.. కోస్తాతీరంలోని ప్రజలకి, ప్రజానేత చంద్రబాబుకి. విలయాలను ఎదుర్కోవడంలో, ప్రజలను సత్వరం ఆదుకోవడంలో చంద్రబాబు దేశానికే ఆదర్శం, సందేహం లేదు. 1996లో హరికేన్ పెనుతుఫాను మొదలుకొని.. ఏపీ తీరాన్ని బలంగా తాకిన హుద్‌హుద్, తిత్లీ, పెథాయి.. ఇప్పుడు మొంథా వరకూ `రాష్ట్రానికి రక్షణ కవచం నిర్మించడంలో చంద్రబాబు సమర్థత అనన్యసామాన్యం. అంతేకాదు అటు ఉత్తరాఖండ్ వరద బాధితుల నుంచి ఒడిశాలో సూపర్ సైక్లోన్ బాధితలకు ఆపన్నహస్తం అందించిన చంద్రబాబు సహృదయాన్ని తక్కువ చేయలేం. వరదలు, అకాల వర్షాలు.. రాష్ట్రానికి ఏ ఆపద వచ్చినా.. రైతులు, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి చంద్రన్న ధైర్యసాహసాలు, రాజకీయ అనుభవం అపారమే.
వాతావరణం సహకరించక పోయినా విపత్తుకన్నా వేగంగా స్పందించడం ఆయన తత్వం. 1996 కోనసీమ హరికేన్ తుఫాను సమయంలో 8 రోజులుపాటు ఆర్డీవో ఆఫీసులోవుండి తుపాను బాధితులను ఆదుకున్నారు. తర్వాత ఒడిశాలో సూపర్ సైక్లోన్ విరుచుకు పడిన సమయంలోనూ ఏపీ విద్యుత్ ఉద్యోగులను పంపి వ్యవస్థను పునరుద్ధరించి ఒడిశా తుపాను బాధితులను ఆదుకున్నారు. 2014లో విశాఖలో హుద్‌హుద్ తుఫాన్ సృష్టించిన భీభత్సం కనీవినీ ఎరుగనిది. తుఫాన్ మధ్యలోనే తుఫాన్‌కన్నా వేగంగా స్పందించి తెల్లారేపాటికి విశాఖ వీధుల్లో జనంమధ్య నిలిచి 10 రోజులుపాటు బస్సునుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తూ.. నిర్విరామంగా శ్రమించి కకావికలమైన విశాఖను, బాధితులను ఆదుకున్న విధానం దేశమంతా చూసిందే. తర్వాత తిత్లీ రాకాసి తుఫాను శ్రీకాకుళం జిల్లాను కకావికలం చేసింది. తిత్లీ తుఫాన్‌తో ఏళ్లతరబడి పెరిగిన కొబ్బరి, జీడిమామిడి తోటలు నేలమట్టమై అపారనష్టం వాటిల్లింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి. దాదాపు 36వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈవిధంగా గడప గడపలో విషాదం మిగిల్చింది తుఫాన్. నేనున్నా.. అధైర్యపడొద్దు అంటూ ప్రజలకు ఆదుకోవడానికి పరుగులు తీశారు చంద్రబాబు.
తీవ్రమైన తిత్లీ తుఫాన్ ఉత్తరాంధ్రపై విరుచుకుపడుతుందన్న సమాచారం అందిన క్షణంనుండి సీఎంగా చంద్రబాబు కంటిపై కునుకులేకుండా తెల్లవార్లూ టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి.. నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాలంటూ సమీక్షల మీద సమీక్షలు నిర్వహించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించారు. తుపాను ఎదుర్కోవడానికి రాజధానిలో కూర్చొని అయినా సహాయ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేయవచ్చు. సమీక్షలు జరపవచ్చు. నష్ట పరిహారం భారీగా ప్రకటించవచ్చు. అన్నీ కుదురుకున్నాక మొక్కుబడి పరామర్శలు చేసి ఆదుకుంటామని హామీలివ్వొచ్చు. కానీ `అందరిలాంటి ప్రజానేత కాదు చంద్రబాబు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పరామర్శించి వారిని ఓదార్చేందుకు ప్రజలవద్దకు మోకాలి లోతు నీళ్లలో నడుస్తూ వెళ్లారు. ప్రజల బాధలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆదుకుంటాను, అధైర్యపడకండి అంటూ యంత్రాంగాన్ని, 15మంది మంత్రులను జిల్లాకురప్పించి తిత్లీ బాధితులను ఆదుకున్నారు. పెథాయి ప్రళయ భీకర తుఫాను రాష్ట్రంపై విరుచుకు పడితే సాంకేతిక సన్నద్ధత, అప్రమత్తతతో తుపానుపై చంద్రబాబు ప్రభుత్వం యుద్ధమే చేసింది. రాష్ట్రానికి పెను నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుని విజయం సాధించింది. తర్వాత బుడమేరు వరద సృష్టించిన విలయం విజయవాడలో విషాదం మిగిలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమేఘాలమీద స్పందించారు. తానే స్వయంగా రంగంలోకి దిగి 75ఏళ్ల వయసులో వరదనీటిలో అర్ధరాత్రి బోటుపై భాధితులను చేరుకున్నారు. వాళ్లకు ధైర్యం చెబుతూ.. ఆహార పోట్లాలు అందించారు. అధైర్య పడొద్దని భాదితులకు భరోసానివ్వడం అసాధారణం.
సీఎం చంద్రబాబుకు అభినందనలు
నేడు మొంథా తుఫాను రాష్ట్రంపై విరుచుకు పడుతుందన్న సమాచారం అందిన క్షణంనుండి సీఎం చంద్రబాబు అర్థరాత్రి 12:20 వరకూ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్‌వల్ల ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకున్నారు. లక్షలాది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆధునిక సాంకేతిక హెచ్చరికల వ్యవస్థల ద్వారా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించి తీరాలి. ఏ ప్రభుత్వం తుపాను నష్టాన్ని అడ్డుకోలేదు. కాని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తుపాను దశ దిశను ఎప్పటికప్పుడు అంచనా వేసి నష్టాన్ని నివారించవచ్చని సీపం చంద్రబాబు నిరూపించారు. కలెక్టర్లు, అధికారులతో రియల్ టైమ్ మానిటరింగ్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీమ్ అహర్నిశలు శ్రమించి ప్రాణనష్టాన్ని నివారించింది. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించి.. రహదార్లు, డ్రెయిన్లను క్లియర్ చేసే పనులు గంటల వ్యవధిలో పూర్తి చేశారు.
రాష్ట్రానికి జగనే ఒక విపత్తు
రాష్ట్రానికి విపత్తుగా పరిణమించిన జగన్‌రెడ్డి, విషాదంలోనూ ప్రభుత్వంపై బుదర చల్లుతూ.. అసత్య ప్రచారాలు, వికృత వ్యాఖ్యలకు తెగబడటం దారుణం, దుర్మార్గం, అమానుషం. జగన్ విమర్శలకు హద్దంటూ లేకపోవడం విచారకరం. ప్రకృతి విషాదాలపైనా రాజకీయ లబ్ది పొందాలనుకోవడం జగన్ నీచ రాజకీయానికి నిదర్శనం. జగన్ ప్రభుత్వం పంటల బీమాకు ప్రీమియం చెల్లించకుండా గుండు సున్నా చుట్టిందని కేంద్రమే లోక్‌సభ సాక్షిగా స్పష్టంగా తెలిపింది. అయినా తానేదో ఉచిత పంటల బీమాను గొప్పగా అమలుచేస్తే.. చంద్రబాబు దానిని నిర్వీర్యం చేసారన్న అసత్య ప్రచారాలకు సాహసించడం జగన్ దగా రాజకీయాలకు పరాకాష్ట. సీఎం కాకున్నా మొంథా తుఫాన్‌నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడినంటూ సిగ్గుమాలిన ప్రగల్పాలకు తెగబడటం జగన్‌కే చెల్లింది. జగన్ సీఎంగా ఉన్నపుడే ప్రకృతి వైపరీత్యాల సమయంలో గడప దాటింది లేదు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ హైదరాబాద్‌లో నివాసానికే జగన్ పరిమితమయ్యారు. పంట నష్టపోయిన రైతుల వద్దకు ఏనాడూ వెళ్లింది లేదు. జగన్ హయాంలో ప్రకృతి విపత్తు సంభవించినపుడు.. దెబ్బతిన్న వరిచేలను చూసేందుకు ప్రత్యేకంగా స్టేజీ సెటప్ వేయించుకోవడం జగన్‌కే చెల్లింది.
ఆయన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
జగన్ హయాంలో విపత్తులు విరుచుకుపడి ప్రజలు ఎంత నష్టపోయినా, పంటలు నీట మునిగి రైతులు రోధిస్తున్నా.. తాడేపల్లి ప్యాలెస్‌నుంచి తల బయటకు పెట్టింది లేదు. తుపానులకు దెబ్బతిన్న పంటలను పొలంలోకివెళ్లి పరిశీలించిన పరిస్థితీ లేదు. రైతులు దిక్కుతోచని స్థితిలోవుంటే.. జగన్ మొక్కుబడిగా ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయారు. 2023 వైపరీత్యంతో.. రైతుల కష్టం నీళ్ళలో కుళ్లుతుంటే.. జగన్‌రెడ్డికి రెడ్ కార్పెట్ స్వాగతం కావాల్సివచ్చింది. అంతకుముందు 2021 నవంబరు 21న అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. భారీగా ప్రాణనష్టం సంభవించింది. అప్పుడు కూడా సీఎంగా జగన్‌రెడ్డి మొక్కుబడి పరామర్శలు చేశారు. ఇప్పుడు మొంథా తుఫానుతో రాష్ట్రం అతలాకుతలమైపోతుంటే జగన్‌రెడ్డి అడ్రస్ ఎక్కడా కనిపించలేదు. జగన్ రోత మీడియా మాత్రం వికృతంగా విషపు రాతలు రాస్తుంది. బురద రాజకీయం చేసి బతకాలనుకోవడం వైసీపీ గతిమాలిన రాజకీయాలకు నిదర్శనం. రోత పత్రిక ఎన్ని రోత రాతలు రాసినా.. ఆపద సమయంలో అండగా నిలిచిందవరో గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. మొన్నటి ఎన్నికలలోనే ప్రజలు బండకేసి బాదినా.. జగన్‌కు బుద్ది రావడంలేదు!
`నీరుకొండ ప్రసాద్














